భోపాల్ నుండి ఇండోర్ వెళ్ళే ప్యాసింజర్ రైలులో ఓ యువకుడిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 23 ఏళ్ల యువకుడు మొబైల్ ఫోన్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన రీల్స్ చూస్తున్నాడనే కారణంతో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి, దూషించారని ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.జీఆర్పీ టీఐ రష్మీ పాటిదార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై బీఎన్ఎస్ సెక్షన్లు 118(1) (ప్రమాదకర ఆయుధాలతో ఉద్దేశపూర్వకంగా గాయపరచడం), 296 (దూషించడం), 351 (నేరపూరిత బెదిరింపు) తదితర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించామని, ఘటనకు సంబంధించిన వీడియో, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె వివరించారు.బాధితుడి కథనం ప్రకారం, శనివారం రాత్రి అతను షుజాల్‌పూర్ నుండి భోపాల్-ఇండోర్ ప్యాసింజర్ రైలు ఎక్కాడు. రైలు దేవాస్ స్టేషన్ దాటిన తర్వాత, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తన వద్దకు వచ్చి, పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన రీల్స్ చూడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రీల్స్ చూస్తూ తమ వైపు చూస్తున్నావని, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావని ఆ ఇద్దరు తనతో వాగ్వాదానికి దిగినట్లు తెలిపాడు.”ఈ క్రమంలోనే వారి మధ్య గొడవ జరిగి అది దాడికి దారితీసింది” అని పోలీస్ అధికారి తెలిపారు. నిందితులు తమది ఇండోర్‌లోని చందన్ నగర్ ప్రాంతమని చెప్పినట్లు బాధితుడు పేర్కొన్నాడని ఆమె అన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని అధికారి రష్మీ పాటిదార్ ధృవీకరించారు.
Read Also : Khawaja Asif : ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యల పై భారత్ చర్యలు