దేశంలో మహిళల సంరక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి. మహిళలపై జరిగే అన్యాయాలను అరికట్టేందుకు, బాధితులకు న్యాయం చేయడంలో ఈ చట్టాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అయితే, ఇప్పుడు అదే చట్టాల దుర్వినియోగం వల్ల పురుషులు అన్యాయానికి గురవుతున్నారని వాదిస్తూ, పురుషుల హక్కుల కోసం గళమెత్తుతున్నారు కొంతమంది. ఈ ఉద్యమం క్రమంగా దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది.
విశాఖ నుంచి ఢిల్లీ వరకు – సత్యాగ్రహానికి పురుషుల పయనం
ఏపీకి చెందిన సేవ్ ఇండియా ఫ్యామిలీ అనే సంస్థ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏప్రిల్ 19న ‘పురుషుల కోసం సత్యాగ్రహం’ పేరిట శాంతియుత నిరసన చేపట్టనుంది. ఇందుకోసం సంస్థ ప్రతినిధులు విశాఖపట్నం నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఢిల్లీకి బయలుదేరారు. వారి ఉద్దేశం ఒకటే – పురుషుల హక్కుల కోసం ప్రభుత్వాన్ని, సమాజాన్ని చైతన్యపరిచేలా ప్రయత్నించడమే.
చట్టాల దుర్వినియోగం – పురుషులపై వేధింపులు
వివాహిత మహిళలపై గృహహింస నిరోధక చట్టం (498A IPC), దంపతుల మధ్య వైవాహిక హింస మరియు తప్పుడు అత్యాచార కేసులు వంటివి కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు పురుష హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కారణంగా ఎందరో పురుషులు తప్పుడు కేసుల్లో ఇరుక్కొని తమ జీవితాలను కోల్పోతున్నారని, మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నారని వారు వాదిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా సంభవిస్తున్నాయి. ఉదాహరణకి, మహిళల వేధింపుల వల్ల అతుల్ సుభాష్, పునీత్ ఖురానా, మానవ్ శర్మ వంటి వారు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ముస్కాన్ రస్తోగి కేసు, తన భర్తను హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసిన సంఘటన, మహిళల వేధింపులు ఎలా భయానకంగా మారుతున్నాయో స్పష్టంగా చూపిస్తోంది. సేవ్ ఇండియా ఫ్యామిలీ ప్రతినిధి మధుసూదన్ రాజ్ ప్రకారం, నేడు ఉన్న చట్టాలు పూర్తిగా లింగపరంగా ఒకవైపు మొగ్గు చూపుతున్నాయి. మహిళలకు మాత్రమే రక్షణ ఇచ్చేలా ఉన్న ఈ చట్టాలు, నిజంగా బాధితుడిగా ఉన్న పురుషుని పట్టించుకోవడంలో విఫలమవుతున్నాయని అన్నారు. ఇందుకు పరిష్కారం ఒక్కటే – జెండర్ న్యూట్రల్ లా అంటే, లింగవివక్ష లేకుండా న్యాయం చేసే విధంగా చట్టాలను రూపొందించాలి. ప్రతీకారం, దోపిడీ మార్గంగా తరచూ తప్పుడు కేసులను మహిళలు పురుషులపై నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. దీని వల్ల పురుషులు నిస్సహాయంగా మారిపోతూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా దేశంలో పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా మారుతున్న అన్నారు. ఇందుకోసమే పురుషులకు కూడా ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేస్తామని అన్నారు.
Read also: Bangladesh: బంగ్లాదేశ్‌లో అధికారం మార్పులతో భారత్‌కు కొత్త తలనొప్పి