Railway-employees : రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతోంది. ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా ఇచ్చే బోనస్‌పై ఈసారి కూడా కేంద్రం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. (Railway-employees) దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని సమాచారం. త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇవి ఆమోదం పొందనున్నాయి.
ఈసారి కూడా ఒక్కో ఉద్యోగికి 78 రోజుల జీతానికి సమానంగా బోనస్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (RPSF) సిబ్బందికి ఇది వర్తించకపోవచ్చు. అలాగే గెజిటెడ్ అధికారులను కూడా ఈ బోనస్ పరిధిలోకి తేబోవడం లేదని తెలుస్తోంది. నాన్-గెజిటెడ్ సిబ్బందికే ఈ లాభం అందనుంది.
ప్రస్తుతం రైల్వేలో 11.27 లక్షల మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరికీ కేంద్రం ఈ బోనస్‌ను ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) రూపంలో అందించనుంది. దీని వల్ల కేంద్ర ఖజానాపై సుమారు ₹1,832 కోట్ల భారం పడనుంది. బోనస్ లెక్కింపులో కనీస వేతన పరిమితిని నెలకు ₹7,000గా నిర్ణయించగా, గరిష్టంగా ఒక్కో ఉద్యోగికి ₹17,951 వరకు బోనస్ వచ్చే అవకాశం ఉంది.
రైల్వే మంత్రిత్వ శాఖ దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, వారి సేవలకు గుర్తింపుగా ఈ బోనస్ ఇవ్వడం జరుగుతోందని కేంద్రం భావిస్తోంది.
ఇదిలా ఉండగా, ఉద్యోగ సంఘాలు మాత్రం వేతన పరిమితిని ఆరో వేతన సంఘం ప్రకారం ₹7,000 కాకుండా, ఏడో వేతన సంఘం సిఫారసు చేసిన ₹18,000 కనీస జీతం ఆధారంగా బోనస్ లెక్కించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఇది తమపై అన్యాయం అవుతుందని అంటున్నాయి.
Read also :