బీహార్ అసెంబ్లీ ఎన్నిక (Bihar Assembly Election) ల వేళ కాంగ్రెస్ పార్టీ తన దృష్టిని అత్యంత వెనుకబడిన తరగతుల (EBC)పై కేంద్రీకరించింది. ఈ తరగతులకు రక్షణ, రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక హామీలను ప్రకటించింది. 10 అంశాల కార్యక్రమంలో భాగంగా “ఈబీసీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్” తీసుకువస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు అమలులో ఉన్న చట్టాల తరహాలోనే ఈ చట్టం ఉండనుంది. దాని ద్వారా అత్యంత వెనుకబడిన తరగతులపై జరుగుతున్న అన్యాయాలను నిరోధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీ నేతలు ఇది చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.
పాట్నాలో సీడబ్ల్యూసీ సమావేశం
బుధవారం పాట్నాలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదం పొందాయి. అనంతరం రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ తీర్మానాలను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, బీహార్ ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి 15 రోజులపాటు జిల్లాల వారీగా పర్యటించామని చెప్పారు. రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని ప్రజలకు వివరించామని తెలిపారు.రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీహార్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా పౌరుల హక్కులు దెబ్బతింటున్నాయని అన్నారు. పార్లమెంటులో తాను రెండు ముఖ్య విషయాలను ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పానని గుర్తు చేశారు. ఒకటి దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, రెండవది 50 శాతం రిజర్వేషన్ పరిమితిని అధిగమించాల్సిన అవసరం ఉందని అన్నారు.
రిజర్వేషన్లపై కొత్త హామీలు
ఆర్టికల్ 15(5) కింద రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పంచాయతీలు, అర్బన్ లోకల్ బాడీస్‌లో ప్రస్తుతం ఉన్న 20 శాతం రిజర్వేషన్‌ను 30 శాతానికి పెంచుతామని తెలిపింది. జనాభా ఆధారంగా కోటా అమలు చేస్తామని హామీ ఇచ్చింది.50 శాతం రిజర్వేషన్ పరిమితిని పెంచే దిశగా చట్టం రూపొందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి, రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చమని కేంద్రాన్ని కోరుతామని తెలిపింది.
నియామకాలపై హామీలు
నియామకాల సమయంలో “నాట్ ఫౌండ్ సూటబుల్” (NFS) అనే కాన్సెప్ట్ సరైనది కాదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీన్ని చట్టవిరుద్ధంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఎందుకంటే ఈ నిబంధన కింద వేకెన్సీలు భర్తీ చేయడం లేదని ఎస్సీలు, ఇతర వెనుకబడిన వర్గాలు ఆరోపిస్తున్నాయి.ఈబీసీ జాబితాలో ఉండే లోపాలను సరిచేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. అండర్ లేదా ఓవర్ ఇన్‌క్లూజన్ సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీ చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
భూమి మరియు కాంట్రాక్టులు
ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన భూములు లేని కుటుంబాలకు ప్రభుత్వం నివాస స్థలాలు కేటాయిస్తుందని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అదేవిధంగా, రూ.25 కోట్ల వరకూ ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఈ కమ్యూనిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది.బీహార్‌లో ఇండియా కూటమి విజయం సాధించిన వెంటనే ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయని కాంగ్రెస్ తెలిపింది. ఈ హామీలు అమలైతే వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు లభిస్తాయని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.
Read Also :