లోక్‌సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంట్ ఆవరణలో మాత్రం తనదైన శైలిలో చిలిపిగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్ మరియు కిరణ్ రిజిజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ అక్కడికి చేరుకున్నారు. మంత్రులను పలకరిస్తూ వారి మధ్యలోకి వెళ్లడం, ఆపై వారు అక్కడి నుంచి వెనుదిరుగుతుంటే “ఎక్కడికి వెళ్తున్నారు? రండి.. అందరం కలిసి మాట్లాడుదాం” అంటూ వారి చేతులు పట్టుకుని లాగే ప్రయత్నం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిపక్ష నేతగా సీరియస్ రాజకీయాలు చేసే రాహుల్, ఇలా అధికార పక్ష మంత్రులతో సరదాగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది.
ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ తీరుపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. పార్లమెంట్ ప్రాంగణంలో మంత్రులతో అలా ప్రవర్తించడం బాధ్యతారాహిత్యమని, ఇది హుందాతనాన్ని తగ్గించేలా ఉందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి కేంద్ర మంత్రులను ఇలా టీజ్ చేయడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఈ విమర్శలను తిప్పికొడుతోంది. రాహుల్ గాంధీని చూసి మాట్లాడలేక మంత్రులు భయపడి పారిపోతున్నారని, ఆ ఫోబియాతోనే వారు అక్కడి నుంచి వెళ్లారంటూ కౌంటర్ ఇస్తోంది. రాజకీయాల్లో వైరం ఉన్నా, వ్యక్తిగతంగా పలకరించుకోవడంలో తప్పులేదని కాంగ్రెస్ శ్రేణులు సమర్థిస్తున్నాయి.
Sangareddy Ward 34 Tension: సంగారెడ్డి పోలింగ్ బూత్‌లో ఉద్రిక్తత.. సీఐపై జగ్గారెడ్డి ఫైర్
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిన తరుణంలో ఈ వీడియో వైరల్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో ‘మొహబ్బత్ కీ దుకాన్’ (ప్రేమ దుకాణం) అనే నినాదాన్ని తరచుగా వాడుతుంటారు. ఈ ఘటన కూడా అదే భావజాలంలో భాగమేనని కొందరు విశ్లేషిస్తుండగా, మరికొందరు దీనిని కేవలం రాజకీయ మైలేజ్ కోసం చేస్తున్న ‘గిమ్మిక్కు’గా కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా, ఉప్పు నిప్పులా ఉండే అధికార-ప్రతిపక్ష నేతల మధ్య ఇలాంటి అరుదైన దృశ్యాలు కనిపించడం పార్లమెంట్ పరిసరాల్లో ఆసక్తికరమైన వాతావరణాన్ని సృష్టించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com