PV Sindhu: దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న పీవీ సింధు

Read Time:  1 min
PV Sindhu: దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న పీవీ సింధు
FONT SIZE
GET APP

PV Sindhu: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, ప్రతిష్టాత్మక ‘ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌’లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వెళుతున్న సింధు, శనివారం దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. ట్రాన్సిట్ హబ్‌గా ఉన్న దుబాయ్ చేరుకున్న తర్వాత ఆమె ప్రయాణించాల్సిన విమానం రద్దు కావడంతో అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది.

Read Also: Iran: కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం

ప్రస్తుతం అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంతో పశ్చిమ ఆసియా గగనతలంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ మీదుగా వెళ్లే అనేక విమాన సర్వీసులను అధికారులు నిలిపివేశారు. ఈ యుద్ధ వాతావరణం కారణంగా సింధుతో పాటు వేల సంఖ్యలో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది.

సోషల్ మీడియాలో వీడియో పోస్ట్

దీనికి సంబంధించి సింధు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఎయిర్‌పోర్టు మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోవడం, తదుపరి అప్డేట్ కోసం అందరూ ఎదురుచూస్తుండటం ఆ వీడియోలో కనిపిస్తోంది. “తదుపరి ప్రకటన వచ్చేవరకు అన్ని విమానాలు రద్దు” అని సింధు పేర్కొంది. అంతేకాదు, ఆమె ఎక్స్ లోనూ తన స్పందన వెలిబుచ్చింది.

“ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏమీ అర్థం కావడం లేదు. నా కళ్ల ముందే ఆకాశంలో క్షిపణి దాడులు, పేలుళ్ల శబ్దాలు వింటుంటే వెన్నులో వణుకు పుడుతోంది. సోషల్ మీడియాలో, వార్తల్లో వస్తున్న భయానక వీడియోలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. దుబాయ్ అంటే నాకు ఎంతో ఇష్టం.. ఎప్పుడూ ప్రశాంతంగా, ఎంతో సేఫ్ గా ఉండే ఈ నగరంలో ఇలాంటి యుద్ధ వాతావరణం చూస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇది నిజంగా నమ్మశక్యం కాని పరిస్థితి.

PV Sindhu stuck at Dubai airport
PV Sindhu stuck at Dubai airport

నా క్షేమ సమాచారం కోసం ఆరా తీస్తూ మెసేజ్ లు చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ నాకు కొండంత బలాన్ని ఇస్తోంది. ప్రస్తుతానికి నేను, నా టీమ్ సభ్యులు దుబాయ్ లోనే క్షేమంగా ఉన్నాం. కానీ ఇరాన్ యుద్ధం కారణంగా ఇక్కడ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. మేం ప్రస్తుతం ఇక్కడే చిక్కుకుపోయాం. ఎయిర్ పోర్ట్ అంతా గందరగోళంగా, అల్లకల్లోలంగా ఉంది. ఎంతోమంది ప్రయాణికులు, చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలు ఎక్కడికి వెళ్లాలో తెలియక పడిగాపులు కాస్తున్నారు.

మేం కూడా ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతామా అని ఆశగా ఎదురుచూస్తున్నాం. మనం గడుపుతున్న సాధారణ జీవితం ఎంత చిన్నదో.. ఎంత అస్థిరమైనదో ఇలాంటి ఘటనలు చూసినప్పుడే మనసుకు తడుతుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇక్కడ చిక్కుకున్న ప్రతి ఒక్కరూ క్షేమంగా బయటపడాలని, త్వరలోనే ఇక్కడ శాంతి నెలకొనాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా” అని తన ట్వీట్ లో పేర్కొంది.

మరోవైపు ఈ విషయంపై భారత బ్యాడ్మింటన్ సంఘం స్పందించింది. సింధుతో పాటు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అధికారులతోనూ టచ్‌లో ఉన్నామని తెలిపింది. “మిగతా క్రీడాకారులు ఇప్పటికే గమ్యస్థానానికి చేరుకోగా, సింధు మాత్రం ఈరోజే బయలుదేరారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం” అని ధుబాయ్ వర్గాలు తెలిపాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.