కర్ణాటక (Karnataka ) రాజధాని బెంగళూరులోని పది మెట్రో స్టేషన్లలో గుజరాత్‌కు చెందిన డెయిరీ బ్రాండ్ అమూల్ (Amul) స్టోర్లకు అనుమతి ఇవ్వడంపై రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. రాష్ట్ర బ్రాండ్ అయిన నందినికి బదులుగా ఇతర రాష్ట్రాల బ్రాండ్‌కు ప్రాధాన్యం ఇవ్వడంపై విపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ, జేడీఎస్ పార్టీల నాయకులు నందినిని ప్రోత్సహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ “సేవ్ నందిని” అంటూ సోషల్ మీడియాలో మద్దతు ఉద్యమం మొదలుపెట్టారు.
విపక్షాల విమర్శలు – కాంగ్రెస్ పై దాడి
విపక్ష జేడీఎస్, బీజేపీలు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను టార్గెట్ చేస్తూ ఆయన కమీషన్ల కోసం కన్నడిగుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించాయి. ఎన్నికల ముందు నందిని బ్రాండ్‌ను ప్రచార హైలైట్‌గా ఉపయోగించిన కాంగ్రెస్, ఇప్పుడు అమూల్‌ను ప్రోత్సహిస్తున్నది వర్గపరమైన స్వార్థమేనని విమర్శించారు. బెంగళూరు మెట్రో స్టేషన్లలో నందిని బదులు అమూల్‌కు స్థానం ఇచ్చిన ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నందినికి అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం అని, ఇది కర్ణాటక రైతులకు, పాల ఉత్పత్తిదారులకు పెద్ద దెబ్బ అని అభిప్రాయపడుతున్నారు.
డీకే శివకుమార్ వివరణ
ఈ ఆరోపణలపై డీకే శివకుమార్ స్పందిస్తూ విపక్షాల విమర్శలను తోసిపుచ్చారు. అమూల్ మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతోనే వారికి అనుమతి ఇవ్వలేసిందని తెలిపారు. పైగా, ఈ 10 మెట్రో స్టేషన్లలో 8 చోట్ల కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తమ నందిని ఔట్‌లెట్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టంచేశారు. ప్రస్తుతం అమూల్ రెండు చోట్ల స్టోర్లు ప్రారంభించిందని, ఇది నందినిని తొలగించడం కాదని వివరించారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా, బీఎంఆర్‌సీఎల్‌కు దరఖాస్తు చేసుకోవాలని నందిని బ్రాండ్ నిర్వాహకులకు ప్రభుత్వం సూచించిందని తెలిపారు. ఇదంతా ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసమే వక్రీకరిస్తున్నాయని ఆరోపించారు.
Read Also : Collector Muzammil Khan : కన్నీళ్లు పెట్టుకున్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్