హరియాణాలోని పాల్వాల్ పోలీస్ స్టేషన్‌లో జఘన్య ఘటన వెలుగులోకి వచ్చింది. కస్టడీలో ఉన్న ఓ నిందితుడిపై స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాధేశ్యామ్ అమానుషంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకొచ్చిన రాధేశ్యామ్, అతని చేతులు కాళ్లు కట్టేసి కొట్టినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. అంతే కాదు, అతనికి పచ్చిమిర్చి ద్రావణం తాగించి, అదే ద్రావణాన్ని అతని ప్రైవేట్ భాగాల్లో పోశారన్న ఆరోపణలు చేశాడు.
రాధేశ్యామ్‌ను సస్పెండ్ చేశారు
ఈ ఫిర్యాదును తీవ్రంగా తీసుకున్న హరియాణా ఎస్పీ చంద్రమోహన్, సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించి, బాధితుడి ఆరోపణలు నిజమేనని నిర్ధారించారు. వెంటనే చర్య తీసుకొని రాధేశ్యామ్‌ను సస్పెండ్ చేశారు. తర్వాత అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ ఘటనపై స్పందించిన డీఎస్పీ కుల్దీప్ సింగ్, మరో ముగ్గురు నిందితులపై కూడా రాధేశ్యామ్ విచారణ సందర్భంగా అదే విధంగా హింసాత్మకంగా ప్రవర్తించారని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ప్రత్యేక శాఖ దర్యాప్తు కొనసాగిస్తోంది.
చట్టం అందరికీ సమానమే. ఎవరైనా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై కఠిన చర్యలు
ఈ సందర్భంగా ఎస్పీ చంద్రమోహన్ మాట్లాడుతూ, “చట్టం అందరికీ సమానమే. ఎవరైనా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. ఈ ఘటన పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీయడంతో పాటు మానవ హక్కుల ఉల్లంఘనగా నిలిచింది. బాధితుడి ధైర్యంతో నిజం వెలుగులోకి రావడం, బాధ్యులపై చర్యలు చేపట్టడం పాల్వాల్ పోలీసులు తీసుకున్న సానుకూల చర్యగా అభివర్ణించవచ్చు.