భారత ప్రభుత్వం ప్రతీ సంవత్సరంలా 2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డు (Padma Awards)ల నామినేషన్లను ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్చి 15 నుంచి ఆహ్వానం తెలియజేయగా, జులై 31 నాటికి ఆ ప్రక్రియ ముగియనుంది. ఈ పురస్కారాల కోసం నామినేషన్లు (Nominations) లేదా సిఫార్సులు అధికారిక రాష్ట్రీయ పురస్కార పోర్టల్ (https://awards.gov.in) ద్వారా పంపవచ్చు.
పద్మ అవార్డులలో ఏమి ఉంటాయి?
పద్మ అవార్డులు (Padma Awards) మూడు కేటగిరీలుగా ఉన్నట్లు మనకు తెలుసు. ‘పద్మశ్రీ’, ‘పద్మ భూషణ్’, ‘పద్మ విభూషణ్’ అవార్డులు దేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాలు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం (Central Govt) 1954 నుంచి ఇవ్వడం ప్రారంభించింది. ఈ పురస్కారాలను ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు.
అర్హతలు – ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
ఈ అవార్డులు వృత్తి, కులం, మతం, ప్రాంతం, లింగం వంటి భేదాలకు అతీతంగా అందరికీ వర్తిస్తాయి. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజినీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమలు వంటి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించి వారికి ఈ అవార్డులు ఇస్తారు. వృత్తి, హోదా, లింగం, జాతి వంటి విభేదాలు లేకుండా ప్రతి వ్యక్తి ఈ అవార్డులకు అర్హులే. కానీ, డాక్టర్లు, శాస్త్రవేత్తలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసేవారు ఈ పద్మ అవార్డులకు అర్హులు కారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
నామినేషన్ లేదా సిఫార్సు చేసేప్పుడు నామినేషన్ లేదా సిఫార్సులో సంబంధిత వ్యక్తి పూర్తి వివరాలు ఉండాలి. అది కూడా పురస్కార్ పోర్టల్లో పేర్కొన్న ఫార్మాట్లో ఉండాలి. అవార్డుకు ప్రతిపాదిస్తున్న వ్యక్తి చేసిన విశిష్టమైన సేవ లేదా కృషిని స్పష్టంగా తెలియజేయాలి. అది కూడా గరిష్ఠంగా 800 పదాల్లో వివరణ ఉండాలి. అలాగే సెల్ఫ్ నామినేషన్ కూడా చేసుకోవచ్చు. అలాగే మహిళలు, సామాజికంగా బలహీన వర్గాలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న వారి ప్రతిభను గుర్తించేందుకు చొరవ చూపాలని ప్రభుత్వం పేర్కొంది.
ఇది పూర్తిగా ఆన్‌లైన్ ప్రాసెస్. https://awards.gov.in అనే పోర్టల్ ద్వారా దీనికి అప్లై చేయవచ్చు. అలాగే, పూర్తి నిబంధనలు మరియు అవార్డు వివరాలకు https://padmaawards.gov.in/AboutAwards.aspx అనే లింక్ ఉపయోగించవచ్చు.
Read also: Parliament Monsoon Sessions: జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు