బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పర్యటన నేపథ్యంలో సమస్తీపూర్ జిల్లాలో చోటుచేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారతరత్న కర్పూరీ ఠాకూర్ 102వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్ ఎక్కడా ఆగకుండా వెళ్లాలని జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం రైల్వే వ్యవస్థను స్తంభింపజేసింది. కర్పూరీ గ్రామ్ స్టేషన్ సమీపంలోని రైల్వే గేటును (లెవల్ క్రాసింగ్) సుమారు 37 నిమిషాల పాటు తెరిచే ఉంచారు. సాధారణంగా రైళ్లు వచ్చే సమయంలో వాహనాలను ఆపి గేటు వేయడం నిబంధన. కానీ ఇక్కడ సీఎం కాన్వాయ్ కోసం రైళ్లను పట్టాలపైనే ఆపేయడం గమనార్హం. దీనివల్ల సమస్తీపూర్-ముజఫర్‌పూర్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి.
Sammakka Saralamma Jatara:తప్పిపోయే వారి కోసం రిస్ట్ బ్యాండ్లు
అధికారుల అత్యుత్సాహం వల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైశాలి ఎక్స్‌ప్రెస్ సమస్తీపూర్ స్టేషన్‌లో సుమారు గంటపాటు నిలిచిపోగా, టాటా-ఛప్రా ఎక్స్‌ప్రెస్ గంటకు పైగా ఆలస్యంగా నడిచింది. షహీద్ ఎక్స్‌ప్రెస్, బరౌనీ-గోండియా ఎక్స్‌ప్రెస్ వంటి ముఖ్యమైన రైళ్లు కూడా ప్లాట్‌ఫారమ్‌లు ఖాళీ లేక స్టేషన్ల బయటే నిలిచిపోయాయి. చంటి పిల్లలు, వృద్ధులు, అత్యవసర పనుల మీద వెళ్లే ప్రయాణికులు ఎండలో, రైలు పెట్టెల్లో బందీలుగా మారిపోయారు. సీఎం కాన్వాయ్ వెళ్లేవరకు గేటు వేయవద్దని డీఎస్పీ స్థాయి అధికారి పదే పదే ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై మరియు అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే వీఐపీలకే ప్రాముఖ్యత ఇస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. రైల్వే నిబంధనల ప్రకారం రైలు రాకపోకలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి, కానీ ఇక్కడ రాజకీయ ప్రోటోకాల్ కోసం ఆ నిబంధనలను తుంగలో తొక్కారు. ఈ “వీఐపీ కల్చర్” సామాన్యుల ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నత స్థాయి విచారణ జరపాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది.