ఉపాధి హామీ పనులపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం: రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త భారం
హైదరాబాద్, గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)పై కేంద్ర ప్రభుత్వం మరోసారి కుంచించగొట్టే నిర్ణయం తీసుకుంది. గతంలో కన్నా తక్కువగా పనిదినాలను కేటాయించడం ద్వారా రాష్ట్రాల్లో పెండింగ్ పనులకు పెద్ద ప్రమాదమే పొంచి ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం 12 కోట్ల పనిదినాలను కోరగా, కేంద్రం కేవలం 6.5 కోట్ల పనిదినాలను మాత్రమే మంజూరు చేసింది. గత ఏడాది కూడా రాష్ట్రం 11 కోట్ల పనులను పూర్తి చేసింది. కేంద్రం గతంలో 8 కోట్ల పనిదినాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వాటి కంటే అధికంగా పనులు పూర్తిచేసింది. అయితే ఈ ఏడాది కేంద్రం కేటాయింపు గణనీయంగా తగ్గించడం రాష్ట్రంపై అధిక భారం మోపుతున్నట్టుగా భావిస్తున్నారు.ఇంతటితోనే కాకుండా, కేంద్రం నుంచి వచ్చిన తాజా మార్గదర్శకాలు పాత పనులను చేపట్టవద్దన్న ఆదేశాలను జారీచేసాయి. దీని వల్ల ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పనులు నిలిచిపోవడం వల్ల మౌలిక సదుపాయాల కల్పనకు ఆటంకం ఏర్పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, చెరువుల పునరుద్ధరణ, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఉపాధి హామీ పనులపై కేంద్రం కేటాయింపు తగ్గింపు – రాష్ట్రంలో తీవ్ర ప్రభావం
రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కేంద్రానికి లేఖ రాసి మరిన్ని పనిదినాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించలేదు. కార్మిక సంఘాలు కూడా కేంద్ర విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పేదలకు ఉపాధినిచ్చే ఈ పథకంపై నిర్లక్ష్యం వహించడాన్ని వారు సమర్థించలేదు.కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పనులపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేపల కొలనుల నిర్మాణం వంటి పనులను ఈ ఏడాది ప్రారంభించినా, కేంద్రం నుంచి వచ్చిన ఆంక్షల కారణంగా పూర్తిస్థాయిలో అమలయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.ప్రత్యేక బృందాల ద్వారా కేంద్రం గత ఏడాది కొన్ని జిల్లాల్లో వంద శాతం కంటే ఎక్కువగా నమోదైన పనులను అనుమానాస్పదంగా చూసి తనిఖీలు జరిపింది. ఈ తనిఖీల తరువాతే ఈ ఏడాది కేటాయింపులపై కోతలు పెట్టినట్లు తెలుస్తోంది.ఇలాంటి పరిస్థితులలో ఉపాధి హామీ పథకం అసలు ఉద్దేశ్యం అయిన పేదలకు ఉపాధి కల్పన అనే లక్ష్యం మసకబారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read More : India : పాకిస్థాన్ జాతీయులకు వీసా సేవలు నిలిపివేసిన భారత్