పహల్గాం లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దృఢమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ దాడికి పాకిస్థాన్ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రత, ప్రజల ప్రాణాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. భారత్ తీసుకుంటున్న చర్యలు పాక్‌కు గట్టి సందేశంగా ఉంటాయని పేర్కొన్నారు.
సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు
పాక్‌తో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం మంచి నిర్ణయమని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇది ఆ దేశం పై మన నిరసనను గట్టి రూపంలో వ్యక్తపరచిన విధానమని అన్నారు. “పాక్‌పై సానుభూతి చూపే అవసరం లేదు. వారి చర్యలకు తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చింది” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దౌత్యపరంగా తగిన ప్రతిస్పందన ఇస్తున్నామని, త్వరలో మిలటరీ స్థాయిలో కూడా పక్కా సమాధానం ఇచ్చే రోజు దూరంగా లేదని పేర్కొన్నారు.
ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కేంద్రం న్యాయం
ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కేంద్రం న్యాయం చేయడం తథ్యమని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. “ప్రతి ప్రాణానికి ప్రతీకారం తప్పదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రపంచానికి స్పష్టంగా తెలియజేసింది” అని తెలిపారు. దేశ భద్రతకు భంగం కలిగించే ఏ చర్యకూ క్షమాపణ ఉండదని, ఉగ్రవాదంపై కఠినంగా స్పందిస్తామనే సంకేతాలను కేంద్రం పంపిందన్నారు.