రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) వేదికగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) రెండు కీలక ప్రాజెక్టులను ప్రకటించారు. ముంబై నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయని ఆమె వెల్లడించారు. ఇందులో భాగంగా 2,000 పడకల అత్యాధునిక మెడికల్ సిటీ (2,000-bed state-of-the-art medical city),130 ఎకరాల విస్తీర్ణంలో కోస్టల్ గార్డెన్‌ను అభివృద్ధి చేయనున్నారు.రిలయన్స్ లాభాపేక్ష రహిత విభాగం రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ సిటీ నిర్మాణం జరగనుంది. ఏజీఎంలో మాట్లాడుతూ నీతా అంబానీ, ఈ ప్రాజెక్ట్ భారత వైద్య రంగంలో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి వసతులతో కూడిన ఈ ఆసుపత్రిలో AI ఆధారిత డయాగ్నోస్టిక్స్, ఆధునిక సాంకేతిక పరికరాలు, అత్యాధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులోకి రానున్నాయి.
ప్రపంచ స్థాయి వైద్య నిపుణులు
ఈ ఆసుపత్రిలో భారత్‌తో పాటు విదేశాల నుంచి కూడా అగ్రశ్రేణి వైద్య నిపుణులను ఆహ్వానించనున్నట్లు నీతా అంబానీ వివరించారు. కేవలం సేవలకే పరిమితం కాకుండా, భవిష్యత్ వైద్యులను తీర్చిదిద్దేందుకు ఒక మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా వైద్య రంగంలో నాణ్యతతో కూడిన ప్రతిభను పెంపొందించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు.వైద్య రంగంతో పాటు పర్యావరణంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. ముంబై తీరం వెంబడి 130 ఎకరాల విస్తీర్ణంలో భారీ పచ్చదనాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను కోస్టల్ రోడ్ గార్డెన్ పేరుతో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇది నగరంలో కాలుష్యాన్ని తగ్గించి, గాలి నాణ్యతను మెరుగుపరుస్తుందని చెప్పారు.
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం
ఈ గార్డెన్‌లో పచ్చదనంతో పాటు ప్రజల విశ్రాంతి కోసం ప్రొమెనేడ్ (విహార ప్రదేశం) కూడా నిర్మించనున్నారు. ముంబై ప్రజలకు శ్వాసకు అనుకూలమైన వాతావరణం, విశ్రాంతి కోసం సహజమైన ప్రదేశాన్ని అందించడం లక్ష్యమని నీతా అంబానీ తెలిపారు.ఒకేసారి ఆరోగ్య రంగం, పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించడం ద్వారా ముంబై వాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని రిలయన్స్ ఫౌండేషన్ స్పష్టం చేసింది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే నగర స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.మొత్తానికి, నీతా అంబానీ ప్రకటించిన ఈ రెండు ప్రాజెక్టులు కేవలం ముంబైకే కాదు, దేశవ్యాప్తంగా వైద్య, పర్యావరణ రంగాలకు ప్రేరణగా నిలిచే అవకాశం ఉంది. రిలయన్స్ ఫౌండేషన్ చేపట్టిన ఈ ప్రయత్నాలు భవిష్యత్ తరాలకు మేలు చేకూర్చే విధంగా ఉండబోతున్నాయి.
Read Also :