కేరళలో ప్రమాదకర నిఫా వైరస్ (Nipah Virus) మరోసారి విజృంభించడం ప్రారంభించింది.. ఈ వ్యాధి సోకి ఒక టీనేజర్ గత నెల 1న కోజీకోడ్‌లోని ఒక ప్రైవేట్ దవాఖానలో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా నిఫా (Nipah Virus)కారణంగా మరో మరణం నమోదైంది. పాలక్కాడ్‌లోని మన్నర్కాడ్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో మరణించాడు. అతడికి నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో నిఫా (Nipah Virus) నిర్ధారణ అయ్యింది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆరు జిల్లాల్లో అలర్ట్ (high alert) ప్రకటించింది. పాలక్కాడ్, మలప్పురం, కోజీకోడ్, త్రిస్సూర్, కన్నూర్, వయనాడ్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నిఘా, నియంత్రణ చర్యలు, కాంటాక్ట్ ట్రేసింగ్‌ను ముమ్మరం చేశారు.
ద్రవాల ద్వారా సోకుతుంది
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 675 మంది నిఫా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మలప్పురం జిల్లాలో 210, పాలక్కాడ్‌లో 347, కోజీకోడ్‌లో 115, ఎర్నాకులంలో ఇద్దరు, త్రిస్సూర్‌లో ఒకరు ఉన్నారు. మలప్పురంలో ఓ వ్యక్తి నిఫా కారణంగా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ జిల్లాలో 82 నమూనాలను పరీక్షించగా నెగెటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక పాలక్కాడ్‌లో 12 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 38 మంది రిస్క్ కేటగిరీలో, 139 మంది హైరిస్క్ కేటగిరీలో ఉన్నారని వివరించారు.
దక్షిణ భారతదేశంలో తొలిసారి నిఫా వైరస్ కేసు మే 19, 2018లో కోజికోడ్ జిల్లాలోనే బయటపడింది. ఈ వైరస్ కారణంగా 2018, 2021లో మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. జంతువుల నుండి ప్రజలకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి బారినపడిన వారి నుంచి ఇది నేరుగా మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. ముఖ్యంగా తుంపర్లు, ముక్కు నుంచి, నోటి నుంచి వచ్చే ద్రవాల ద్వారా సోకుతుంది. ఈ వైరస్ లక్షణాలు తొందరగా బయటపడవు. ఈ వైరస్ కొందరిలో మెదడువాపుకు కారణమవుతుంది. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా 4 నుంచి 15 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి.
వైరస్ లక్షణాలు
వైరస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం, అలసట లాంటి లక్షణాలు ఉంటాయి. వైరస్ సోకిన వారిలో దాదాపు 75% మంది మరణించే అవకాశముంది. దీనికి ప్రత్యేకమైన చికిత్సగానీ, ఔషధాలుగానీ లేవు. కాబట్టి మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
నిపా వైరస్ అంటే ఏమిటి?
నిపా అనేది తీవ్రమైన, మరియు కొన్నిసార్లు ప్రాణాంతకమైన వైరల్ వ్యాధి . నిపా వైరస్ పండ్ల గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది మరియు ప్రజలను మరియు ఇతర జంతువులను అనారోగ్యానికి గురి చేస్తుంది. నిపా వైరస్ వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో, తరచుగా బంగ్లాదేశ్ మరియు భారతదేశంలో నిపా వ్యాప్తి దాదాపు ప్రతి సంవత్సరం సంభవిస్తుంది. నిపా ఉన్నవారిలో దాదాపు 40%–70% మంది మరణిస్తున్నారు.
నిపా టీకా ఉందా?
నిపా అనేది పారామిక్సోవైరస్ కుటుంబానికి చెందిన ఒక జూనోటిక్ వైరల్ వ్యాధి. ఇది సోకే వారిలో 75 శాతం మందిని చంపగలదు మరియు ప్రస్తుతం దీనికి వ్యతిరేకంగా ఆమోదించబడిన చికిత్సలు లేదా టీకాలు లేవు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Indian Food : వడాపావ్, సమోసా, జిలేబీలపై కేంద్రం కీలక నిర్ణయం