ముంబై (Mumbai) నగరాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు అమానుష స్థితిని సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విఖ్రోలి ప్రాంతంలో దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది.
కుటుంబంపై విరిగిపడ్డ కొండచరియలు
వివరాల ప్రకారం, విఖ్రోలి (Vikhroli)లోని జన్‌కల్యాణ్ సొసైటీలో శనివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం సంభవించిన సమయంలో ఓ కుటుంబంలోని నలుగురు సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటం (Landslide)తో వారు శిథిలాల కింద ఇరుక్కుపోయారు. ఇందులో షాలు మిశ్రా, సురేశ్‌చంద్ర మిశ్రా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సహాయక బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఆర్తి మిశ్రా, రితురాజ్ మిశ్రాలను బయటకు తీశి రాజావాడి ఆసుపత్రికి తరలించారు.
నగరాన్ని ముంచెత్తిన వరద నీరు
శనివారం ఉదయం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల ప్రభావంతో ముంబైలోని గాంధీ నగర్, కింగ్స్ సర్కిల్ వంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు వరద నీటితో నిండిపోవడంతో రవాణా పూర్తిగా స్థంభించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత వాతావరణ శాఖ (IMD) ముంబై (Mumbai), రాయ్‌గడ్ జిల్లాలకు మరింత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది.
పోలీసుల హెచ్చరికలు, అత్యవసర నంబర్లు
ముంబై పోలీసులు పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసర అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణం ప్రమాదకరమని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం 100, 112, 103 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.
బీఎంసీ సహాయక చర్యలు
మరోవైపు, బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) రక్షణ చర్యలను వేగవంతం చేసింది. వారి సిబ్బంది క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నారని అధికారులు వెల్లడించారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు 1916 నంబరుకు కాల్ చేయాలని కోరారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రదేశంలో శిథిలాలను తొలగించి, భద్రత కోసం సమీప ఇళ్లను ఖాళీ చేయించామని అధికారులు వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: