దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్‌లోని(MP) ఇండోర్‌లో తీవ్ర విషాద ఘటన వెలుగుచూసింది. నగరంలోని భగీరత్‌పుర ప్రాంతంలో కలుషిత నీటిని తాగిన కారణంగా ఇప్పటివరకు ఎనిమిది మంది మృతిచెందగా, మరో 66 మందికిపైగా అనారోగ్యానికి గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Read Also: TG Crime: అమానుషం.. మురుగు కాలువలో నెలల పసికందు మృతదేహం
ఈ ఘటనపై ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణమే విచారణకు ఆదేశించారు. అధికారుల ప్రాథమిక నివేదిక ప్రకారం, ముగ్గురు కలుషిత నీటి కారణంగా మృతి చెందగా, మరో ఐదుగురు గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. అయితే స్థానికంగా అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఘటనపై రాజకీయంగానూ స్పందనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీ ఈ ఘటనను అత్యంత దురదృష్టకరమని పేర్కొంటూ, ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం తక్షణమే అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మంగళవారం రాత్రి ఆలస్యంగా ఇండోర్ మేయర్ అధికారికంగా మూడు మరణాలను ధృవీకరించగా, మొత్తం మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ ఘటనలో నంద్ లాల్ పాల్, తారా బాయి, ఉమా కోరి, గోమతి రావత్, సీమా ప్రజాపతి, మంజులత దిగంబర్ వధే, ఊర్మిళా యాదవ్, సంతోష్ బిచోలియా మృతిచెందిన వారిగా అధికారులు గుర్తించారు.
ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు
ఈ ఘటనను(MP) సీరియస్‌గా తీసుకున్న సీఎం మోహన్ యాదవ్ బాధితులకు ఉత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే బాధ్యతారాహిత్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై జోనల్ ఆఫీసర్ శాలిగ్రామ్ షిటోల్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ (PHE) విభాగానికి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్‌చార్జ్ యోగేష్ జోషిలను సస్పెండ్ చేశారు. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు సీఎం ప్రకటించారు.
ఇదిలా ఉండగా, భగీరత్‌పుర ప్రాంతంలో వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, బలహీనత వంటి లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు 2,000 మందికి పైగా ఈ సమస్య బారిన పడ్డారని అంచనా. ప్రస్తుతం 25 నుంచి 30 ఆరోగ్య శాఖ బృందాలు ఇంటింటా సర్వేలు నిర్వహిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటివరకు 1,100కు పైగా ఇళ్లను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మరిగించిన నీటినే తాగాలని సూచించిన అధికారులు, నీటి నమూనాలను పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల నివేదికలు 48 గంటల్లో అందే అవకాశముందని వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: