పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్‌పై అన్ని కోణాల్లో ఒత్తిడి పెంచుతోంది. ఇప్పటివరకు దౌత్య, ఆర్థిక పరంగా పాక్‌ను ముట్టడి చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నేరుగా ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన నివాసంలో రక్షణశాఖ మంత్రి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఎన్‌ఎస్‌ఏ, త్రివిధ దళాధిపతులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ భేటీలో పాక్‌పై ఎలా ఎదురు దాడికి వెళ్తామనే అంశంపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
ఉగ్రవాదంపై పోరులో పూర్తి స్వేచ్ఛ
ఈ భేటీలో ప్రధాని మోదీ భారత సాయుధ దళాలకు ఉగ్రవాదంపై పోరులో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దాడి ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరగాలి అనే నిర్ణయం పూర్తిగా ఆర్మీకి వదిలివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేయడమే తమ లక్ష్యమని, భారత సైన్యంపై తమకు అపారమైన నమ్మకం ఉందని మోదీ పేర్కొన్నారు. దాడులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, ఇండియన్ ఆర్మీ దశల వారీగా ప్రతీకారం తీర్చుకునే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి.
Read Also : Imran Hashmi : పహల్గామ్ ఉగ్రదాడిపై ఇమ్రాన్ హష్మి ఫైర్
పర్యాటకులను హత్య చేసిన ఉగ్రవాదులకు తగిన శిక్ష
ప్రధాని మోదీ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పహల్గామ్ దాడిలో అమాయక పర్యాటకులను హత్య చేసిన ఉగ్రవాదులకు తగిన శిక్ష తప్పదని, వారి వెనక ఉన్న శక్తులకూ గట్టి హెచ్చరిక తప్పదని మోదీ స్పష్టం చేశారు. దేశానికి భద్రతే ప్రథమమని, ఉగ్రవాదంపై రాజీ లేదని తేల్చిచెప్పారు. మోదీ తీసుకున్న తాజా నిర్ణయంతో దేశం యుద్ధానికి సిద్ధమవుతోందా? అనే చర్చలు ఊపందుకున్నాయి.