Meghalaya Assembly: ప్రజాస్వామ్య దేవాలయంలో బంధుత్వాల కంటే బాధ్యతలే మిన్న అని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా, ఆయన భార్య, ఎమ్మెల్యే మెహతాబ్ చందీ ఎ. సంగ్మా నిరూపించారు. మేఘాలయ అసెంబ్లీ వేదికగా వీరిద్దరి మధ్య జరిగిన, చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మరొకరు ప్రజాప్రతినిధి. భర్త అని కూడా చూడకుండా మెహతాబ్ అడిగిన ప్రశ్నలకు, ముఖ్యమంత్రి అంతే హుందాగా సమాధానం ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు.
Read Also: Maoist Leader Ganapathi: ఇక గణపతిపైనే కన్ను!
సమస్యలపై ఎమ్మెల్యే మెహతాబ్ ప్రశ్నల వర్షం
గ్యాంబెగ్రే నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మెహతాబ్ చందీ.. రాష్ట్రంలోని పశుసంవర్ధక విద్యా ప్రాజెక్టుల జాప్యంపై సభలో గళమెత్తారు. 2022లో క్యాబినెట్ ఆమోదించిన ఒక వెటర్నరీ కాలేజీ, రెండు ఫిషరీస్ కాలేజీలు, ఒక డైరీ కాలేజీ పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయని ఆమె నేరుగా ముఖ్యమంత్రిని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెటర్నరీ శిక్షణ కేంద్రాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, దీనివల్ల విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
హుందాగా స్పందించిన ముఖ్యమంత్రి సంగ్మా
తన భార్య అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఏమాత్రం తడబడకుండా, అధికారిక గణాంకాలతో సమాధానమిచ్చారు.రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు పశుపోషణపై ఆధారపడి ఉన్నారని, అందుకే ఈ మూడు కళాశాలలను అత్యవసరంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అయితే శిక్షణ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉండటం నిజంగా ఆందోళనకరమైన విషయమేనని, ఖాళీలను భర్తీ చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన హామీ ఇచ్చారు.అంతేకాకుండా డీపీఆర్ తయారీలో జాప్యం జరగడానికి భూమి గుర్తింపు,
ప్రణాళికా పరమైన కారణాలు ఉన్నాయని ఆయన వివరించారు. రీ-భోయ్ జిల్లాలోని కిర్డెంకులై వద్ద సుమారు 800 ఎకరాలను వెటర్నరీ కాలేజీ కోసం గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ. 334 కోట్లు ఖర్చు అవుతుందని, 19 విభాగాలు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. ఆర్థిక పరమైన అవసరాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సంగ్మా సభకు హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: