వక్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) ఈనెల 3న దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించాలనుకుంది. అయితే దేశవ్యాప్తంగా పండగ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో, శాంతి భద్రతల దృష్ట్యా, ప్రజల ప్రయాణాలు, వ్యాపారాలపై అంతరాయం కలగకుండా ఉండేందుకు బోర్డు ఈ బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేసింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని కూడా AIMPLB స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని బోర్డు ‘ప్రజాస్వామ్యపరమైన బాధ్యతతో తీసుకున్నదని’ పేర్కొంది.
Electricity Charges : భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీల పెంచం – చంద్రబాబు
వక్స్ సవరణ చట్టం ప్రకారం వక్స్ బోర్డుల ఆస్తుల నిర్వహణ, పర్యవేక్షణ, ఆస్తుల బదిలీ, భూస్వామ్యాలపై ప్రభుత్వ జోక్యం పెరగడం వంటి అంశాలు చోటుచేసుకోవచ్చని ముస్లిం సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. వక్స్ ఆస్తులపై ఉన్న సాంప్రదాయ హక్కులు, మతపరమైన స్వాతంత్ర్యం తగ్గిపోతుందనే భయం వ్యక్తమవుతోంది. బోర్డు ఈ చట్టం ముస్లింల మతపరమైన సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటోంది. అందుకే దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని, బంద్‌ను వాయిదా వేసినంత మాత్రాన ఆందోళనలు ఆగవని AIMPLB స్పష్టం చేసింది.
AIMPLB ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. వక్స్ సవరణ చట్టం అమల్లోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పిటిషన్లు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ముస్లిం మతపరమైన సంఘాలు, సామాజిక సంస్థలతో సంప్రదింపులు కొనసాగిస్తున్న బోర్డు, త్వరలోనే కొత్త బంద్ తేదీని ప్రకటించి నిరసనలను మరింత బలపరిచే వ్యూహం రూపొందిస్తోంది. పండుగల తరువాత నిరసనల తీవ్రత పెంచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని AIMPLB భావిస్తోంది.