దేశంలో వచ్చే జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇది ఆశ్చర్యకరమైన నిర్ణయంగా భావించబడుతోంది, ఎందుకంటే ఇప్పటి వరకు ఈ అంశంపై బీజేపీ మౌనమే పాటిస్తోంది. గత కొంతకాలంగా విపక్ష నేత రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ తరచూ దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పహల్గాం ఉగ్రదాడి, భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య రావడం గమనార్హం.
బీహార్, తెలంగాణపై కేంద్ర లక్ష్యం?
ఇప్పటికే బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం కులగణన పూర్తి చేసింది. అదే తరహాలో తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టింది. అయితే, ఈ లెక్కలపై నిపుణులు, విపక్షాలు విమర్శలు వ్యక్తం చేయడంతో కేంద్రం స్వయంగా కులగణన చేయాలని భావించినట్లు అర్ధమవుతోంది. కేంద్ర కులగణనలో బీహార్, తెలంగాణలలో కూడా లెక్కలు తిరిగి తీసుకోవాలన్న ఉద్దేశం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల కులగణనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు కూడా నిశ్చింతపడతాయని భావిస్తున్నారు.
ఎన్నికల వ్యూహమేనా?
2025లో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కులగణన కేంద్ర నిర్ణయం ఓ ఎన్నికల వ్యూహంగా చూస్తున్నారు. బీసీ వర్గాలు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందని భావిస్తున్న తరుణంలో, వారి మద్దతు పొందేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నదని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కులగణన చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న బీజేపీ ఊహించని విధంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజకీయ రంగంలో కొత్త మలుపు తీసుకొచ్చింది.
Read Also : Tragedy : వడ్ల మిషన్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి