ఆపరేషన్ సిందూర్ అనంతరం కేంద్రం చర్యలు వేగవంతం
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ పై దెబ్బకు దెబ్బతీసిన భారత్ తదుపరి చర్యలపై దృష్టి కేంద్రీకరించింది. పాకిస్థాన్ చర్యలకు కౌంటర్ ఇచ్చిన విధానం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతోంది. ఈ ఆపరేషన్ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురయ్యినా వెంటనే స్పందించేలా కేంద్రం చర్యలు ప్రారంభించింది. భారత భద్రతాపరంగా అధిక అప్రమత్తతతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో అత్యవసర భద్రతా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు (CSs), పోలీసు ప్రధానాధికారులు (DGPs) ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ప్రత్యేకంగా లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా సమీక్షలో పాల్గొన్నారు. సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు, ఇంటెలిజెన్స్ సమాచార వ్యవస్థ సమీక్షకు గురయ్యాయి. ప్రతీ రాష్ట్రం తమ వద్ద ఉన్న సమాచారం, విశ్లేషణలను కేంద్రానికి అందజేసింది.
పక్కా ప్రణాళికలతో కేంద్రం ముందుకు
పాకిస్థాన్‌పై భారత్ తీసుకున్న చర్యల తరువాత అక్కడి నుంచి ప్రతిస్పందన వస్తుందన్న అనుమానాల నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. సరిహద్దు రాష్ట్రాల్లో జాతీయ భద్రతా దళాలను సమర్థవంతంగా మోహరిస్తోంది. డ్రోన్, శాసత్ర, శత్రు చొరబాట్లను గుర్తించే అధునాతన సాంకేతిక పరికరాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. రాష్ట్రాల పోలీసు విభాగాలతో పాటు, కేంద్ర బలగాలు సమన్వయంగా పని చేయనున్నాయి. దేశ భద్రత విషయంలో కేంద్రం ఎలాంటి మినహాయింపు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇటువంటి సమీక్షల ద్వారా రహస్య సమాచార వ్యవస్థను మెరుగుపరచడం, స్థానిక స్థాయిలో అప్రమత్తత పెంచడం లక్ష్యంగా ఉంది.
మే 8న అఖిలపక్ష సమావేశం: రాజకీయ పార్టీలకు కేంద్ర ఆహ్వానం
భద్రతా వ్యవస్థ గురించి స్పష్టతనిచ్చేందుకు, పార్లమెంటరీ పక్షాలకు సమగ్ర సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మే 8వ తేదీ ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ భేటీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ఎలా సాగిందో, భవిష్యత్ ప్లాన్ ఏంటో, అంతర్గత భద్రతపై తీసుకుంటున్న చర్యలు ఏంటో వివరించనుంది. అఖిలపక్ష భేటీలో దేశ భద్రతపై ఐక్యత ప్రదర్శించడానికి ఇది మంచి వేదిక అవుతుంది. దేశపరిస్థితులపై ప్రతిపక్షాలు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా అప్రమత్తత, ప్రజల్లో నమ్మకం
ఈ అన్ని చర్యలతో పాటు ప్రజల్లో విశ్వాసాన్ని బలోపేతం చేయడం కూడా కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. భద్రతా పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నప్పటికీ, అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. మీడియా ద్వారా ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించడం జరుగుతోంది. పౌరులు పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారం మీదే ఆధారపడాలని సూచనలిస్తున్నారు.
read also: Operation Sindoor On Pakistan: తనకు ఎలాంటి పశ్చాత్తాపం, భయం లేదు: మసూద్ అజహర్