Holi travel rush 2026 : హోలీ (Holi 2026) పండుగ సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమాన టికెట్లు భారీగా పెరగగా, రైళ్లలో సీట్లు దొరకడం కష్టమైపోయింది. సొంతూరికి వెళ్లాలనుకునే సామాన్య ప్రయాణికులకు ఈసారి హోలీ ప్రయాణం నిజంగా అగ్నిపరీక్షగా మారింది.
మార్చి 3న హోలికా దహన్, 4న హోలీ ఉండటంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. స్తోమత ఉన్న వారు విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటున్నా, టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులకు రైళ్లు ప్రధాన ఆధారంగా మారాయి. అయితే, అక్కడ కూడా సీట్లు పూర్తిగా నిండిపోయాయి.
ప్రీమియం రైళ్లైన వందే భారత్, రాజధాని, తేజస్ వంటి సర్వీసుల్లో వెయిటింగ్ లిస్ట్‌లు వందల్లోకి చేరాయి. పలు రూట్లలో ‘REGRET’ స్టేటస్ కనిపిస్తోంది. అంటే వెయిటింగ్ లిస్ట్ కూడా నిండిపోయి బుకింగ్స్ నిలిపివేయబడ్డాయని అర్థం. ఢిల్లీ నుంచి పాట్నా, సిలిగురి, కోల్‌కతా వంటి మార్గాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. డైనమిక్ ప్రైసింగ్ విధానం కారణంగా కొన్ని రైళ్లలో టికెట్ ధరలు విమాన ఛార్జీలతో సమానంగా మారాయి.
Read Also: Rinku Singh: తండ్రికి క్యాన్సర్.. అయినా జట్టు కోసం చెన్నైకి చేరుకున్న రింకూ
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఉత్తర రైల్వే, మధ్య రైల్వే పరిధిలో వందలాది అదనపు సర్వీసులు నడుపుతున్నాయి. అయినప్పటికీ డిమాండ్ అధికంగా ఉండటంతో వెయిటింగ్ లిస్ట్‌లు తగ్గడం లేదు. చాలా మంది ఇప్పుడు తత్కాల్ టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు.
రైళ్లలో సీట్లు దొరకని వారు ప్రైవేట్ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే అక్కడ కూడా పరిస్థితి దాదాపు ఇదే. సాధారణంగా తక్కువ ఉండే ఛార్జీలు ఇప్పుడు రెట్టింపుకి పైగా పెరిగాయి. ముఖ్యంగా ఢిల్లీ ఆనంద్ విహార్, ముంబై బోరివలి, బెంగళూరు మజెస్టిక్ బస్ స్టాండ్‌ల వద్ద భారీ రద్దీ కనిపిస్తోంది.
పండుగల సమయంలో రవాణా వ్యవస్థపై పడే ఒత్తిడి మరోసారి బయటపడింది. మౌలిక సదుపాయాల విస్తరణ, అదనపు రైళ్లు, పారదర్శక టికెట్ విధానాల అవసరాన్ని ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు.
Hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: