ఉల్లిపాయ.. (onion) ఒక దంపతుల మధ్య పెద్ద చిచ్చు పెట్టింది. ఒకరికి ఇష్టంగా, మరొకరికి అయిష్టంగా మారిన ఈ ఆహారపు అలవాటు ఏకంగా రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న వారి వైవాహిక జీవితానికి తెరదించింది. కేవలం ఉల్లిపాయ కోసం 23 ఏళ్ల వైవాహిక జీవితానికి విడాకులు తీసుకున్న ఈ జంట వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది, నెటిజన్లు దీనిపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
Read Also: Saudi Weather Alert:సౌదీ ఎడారిలో వర్ష బీభత్సం: రోడ్లు, భవనాలు నీటిమయం
మత విశ్వాసాలు మరియు విభేదాల ప్రారంభం
గుజరాత్‌లోని (Gujarat) అహ్మదాబాద్‌కు చెందిన ఈ జంట 2002లో వివాహం చేసుకున్నారు. భార్య స్వామినారాయణ్ అనే మత బోధకుణ్ని అనుసరించడం ప్రారంభించారు. ఆయన సూచనల మేరకు ఆమె ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి వాడకాన్ని తగ్గించి, భర్తపై కూడా వాటిని ఉపయోగించరాదని కండీషన్ పెట్టారు. అయితే, భర్త మరియు ఆయన తల్లి అప్పటికే ఉల్లికి బాగా అలవాటు పడి, ఉల్లి లేకుండా భోజనం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఇంట్లోకి ఉల్లిపాయల్ని తీసుకురాకుండా ఉండేందుకు భార్య గట్టిగానే ప్రయత్నించారు. ఈ విషయంలో ఆ దంపతుల మధ్య చాలా కాలంగా విభేదాలు నడుస్తూనే ఉన్నాయి.
విడి వంటకాలు, గొడవలు మరియు విడాకులు
విభేదాలు పెరగడంతో భార్య చేసేదేమీ లేక, తన కోసం మాత్రమే విడిగా ఉల్లిలేని వంటకాలను చేసుకోవడం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా, ఇంట్లోని అన్ని వస్తువులను కూడా వేరుగా ఉపయోగించడం ప్రారంభించారు. ఒకే ఇంట్లోనే ఉంటూ, అంటీముట్టనట్టు ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ విభేదాల కారణంగా ఆమె 2007లో తన బిడ్డతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత, 2013లో అహ్మదాబాద్ కోర్టులో భర్త విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆహారపు విషయంలో భార్య తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొంటూ, తమ మధ్య చెలరేగిన వాగ్వాదాన్ని న్యాయస్థానానికి వివరించారు. దీంతో 2024లో న్యాయస్థానం అతనికి విడాకులు మంజూరు చేసింది.
భరణం చెల్లింపు మరియు హైకోర్టు ఆదేశాలు
విడాకులు మంజూరు చేస్తూనే, కోర్టు భార్యకు మెయింటెనెన్స్ కింద భరణం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశానుసారం ఆయన భరణం సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఆమె ఇటీవల గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం రూ. 13.02 లక్షలకు గానూ, రూ. 2.72 లక్షలు మాత్రమే చెల్లించాడని ఆమె పేర్కొన్నారు. దీంతో భర్త వెంటనే మరో రూ. 4.27 లక్షలు ఆమెకు బదిలీ చేశారు. మిగతా మొత్తాన్ని కూడా చెల్లించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఆహారపు అలవాట్లు పొసగనప్పుడు బలవంతంగా కలిసి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటూ, అహ్మదాబాద్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ విడాకుల అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: