ప్రస్తుతం ఉన్న జీఎస్టీ (GST) ని సవరించి జీఎస్టీ 2.0ని కేంద్రం తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ప్రజలపై భారం తగ్గుతుందని, దీపావళి బహుమతిలా భావించవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.జీఎస్టీ కౌన్సిల్ ప్రకారం కొత్త పన్ను విధానం సెప్టెంబర్ 22 (September 22) నుంచి అమల్లోకి రానుంది. ధరలు తగ్గుతాయని చెబుతున్నా, వినియోగదారుల పరిస్థితి అలా కనిపించడం లేదు. పీడబ్ల్యూసీ ఇండియా విడుదల చేసిన వాయిస్ ఆఫ్ కన్స్యూమర్ 2025 నివేదిక ప్రకారం, ఈ ఏడాది ప్రారంభం నుంచే చాలామంది ప్రజలు ఆహారం మినహా ఇతర అవసరాలకు డబ్బు వెచ్చించలేకపోతున్నారు.
ఆహార ఖర్చులకే పరిమితమైన కుటుంబాలు
నివేదికలో 40 శాతం మంది తమ ఆదాయం కేవలం బియ్యం, పప్పులు, కూరగాయలు, నిత్యావసర సరుకులకే సరిపోతుందని పేర్కొన్నారు. అంటే విద్య, దుస్తులు, ప్రయాణం వంటి ఖర్చులు చేయడానికి అవకాశం లేకపోవడం స్పష్టమైంది. తక్కువ ఆదాయం, ఉద్యోగ భద్రతా లోపం ప్రధాన కారణాలని నిపుణులు సూచిస్తున్నారు.కొత్త జీఎస్టీని 5 శాతం, 18 శాతం స్లాబులకే పరిమితం చేశారు. కొన్ని వస్తువుల ధరలు తగ్గుతుండగా, మరికొన్నివి పెరుగుతున్నాయి. ముఖ్యంగా కిరాణా, ఆహార పదార్థాలు, విద్యుత్ బిల్లులు వంటి ఖర్చులు అదనపు భారంగా మారే అవకాశం ఉంది. దీంతో జీవన వ్యయం పెరిగి, మధ్య తరగతి, పేద వర్గాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
మధ్యతరగతిపై భారం
పన్ను రేట్లు పెరగడం వల్ల విద్య, ఆరోగ్యం, రవాణా, బ్యాంకింగ్ సేవల ఖర్చులు పెరుగుతాయి. ఇవన్నీ నేరుగా వినియోగదారులపై పడతాయి. ప్రభుత్వం మాత్రం దీర్ఘకాల ప్రయోజనం ఉంటుందని చెబుతున్నా, ప్రజలకు తక్షణ భారమే ఎక్కువగా అనిపిస్తోంది.పీడబ్ల్యూసీ డైరెక్టర్ హితాంషు గాంధీ మాట్లాడుతూ భారత దేశంలో జీవన వ్యయ సంక్షోభం స్పష్టంగా ఉందని చెప్పారు. గృహ పొదుపు రేటు గత నాలుగేళ్లలో తగ్గిపోయిందని తెలిపారు. రుణ భారం కూడా కుటుంబాలపై ఒత్తిడిని పెంచుతోందని పేర్కొన్నారు.
తగ్గింపుల అసలు లబ్ధి ఎవరికీ?
పిడబ్ల్యూసీ భాగస్వామి రవి కపూర్ ప్రకారం జీఎస్టీ తగ్గింపులు ఎక్కువగా ఎలక్ట్రానిక్స్, యాత్ర, హోటల్ ఖర్చులకు మాత్రమే వర్తిస్తున్నాయి. సాధారణ వినియోగదారులకు, ముఖ్యంగా పేద కుటుంబాలకు పెద్దగా ఉపయోగం లేదని ఆయన చెప్పారు.జీఎస్టీ తగ్గింపులు ఫార్మల్ రంగ ఉత్పత్తులకు డిమాండ్ పెంచవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం 100 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చని కూడా అంచనా. అయితే ఈ లాభం నిజంగా వినియోగదారుల వరకు చేరుతుందా అన్నదానిపై సందేహాలున్నాయి.
Read Also :