గుడ్ ఫ్రైడే – ప్రభువు ప్రేమకు స్మరణార్థం
నేడు ‘గుడ్ ఫ్రైడే’. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈ రోజును యేసుక్రీస్తు సిలువలో మరణించిన రోజుగా గుర్తుచేసుకుంటూ, ఆయనకు ఆరాధనలు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ పండుగను మనం యేసయ్య ఈ లోకంలో జన్మించిన రోజుగా జరుపుకుంటే, గుడ్ ఫ్రైడేను ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా సిలువలో మరణించిన దినంగా ఆత్మవిశ్వాసంతో గుర్తించాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రజల రక్షణ కోసమే వచ్చాడు. ఆయన్ని పూజించడమే కాదు, ఆయన జీవిత ప్రయాణాన్ని, అర్ధాన్ని మన జీవితాల్లో ప్రతిబింబింపజేసుకోవాలన్నదే ఈ దినార్థం.యేసయ్య ముప్పైమూడు సంవత్సరాల పాటు ఈ భూమిపై జీవించి, చివరకు మన పాపాలను మోసుకుని, సిలువలో తన ప్రాణాలను సమర్పించారు. ఆయన సిలువలో పలికిన ఏడు మాటలు ఆయన దివ్య ప్రేమను, క్షమాశీలతను, బాధ్యతను మరియు పరిపూర్ణతను చాటిచెప్పాయి. మొదట ఆయన “తండ్రీ, వీరిని క్షమించుము. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు” అని చెప్పడం, ఆయన క్షమాభావాన్ని తెలియజేస్తుంది. ఆయనను సిలువలో చంపిన వారిని క్షమించమని తండ్రిని ప్రార్థించడం మహా దయకు నిదర్శనం.తర్వాత, ఆయన పక్కనే సిలువలో ఉన్న ఓ దొంగ మారుమనసుతో “నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నప్పుడు, యేసయ్య “నీవు నాతోకూడ పరదైసులో ఉంటావు” అని హామీ ఇచ్చారు. ఇది మారుమనస్సు గల వారిని ఆయన ఎలా ఆదరిస్తాడో తెలియజేస్తుంది. ఇక తన తల్లి మర్యాన్ని శిష్యుడు యోహాను సంరక్షణకు అప్పగించడం, ఆయన బాధ్యతాభావాన్ని తెలియజేస్తుంది. “నా దేవా, నన్నెందుకు విడిచితివి?” అని ఆయన చేసిన పిలుపు, ఆయన తండ్రితో ఉన్న సంబంధం విరిగిపోయిన బాధను సూచిస్తుంది. “దప్పిగా ఉన్నాను” అని అన్నప్పుడు, ఆయన శారీరక బాధను మాత్రమే కాక, మానవత్వాన్ని వ్యక్తం చేశారు.
గుడ్ ఫ్రైడే – యేసయ్య త్యాగానికి స్మరణదినం
“సమాప్తమైనది” అనే మాటతో ఆయన తన కార్యాన్ని పూర్తిచేశాడు. చివరగా “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను” అని చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పగించారు. ఆయన మరణం ద్వారా ప్రపంచానికి రక్షణను అందించారు.ఈ ‘గుడ్ ఫ్రైడే’ రోజున, మనం కేవలం ఆచారంగా కాక, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తించాలి. ఆయన మన పాపాలను తీసుకుని మనకొరకు మరణించాడు. మనం ఆయనను నిజమైన రక్షకునిగా విశ్వసించాలి. పాపాలను విడిచి, ఆయన మార్గంలో నడవాలని తీర్మానించాలి. ఆయన మరణం వల్ల మనకు రక్షణ లభించిందన్న సత్యాన్ని గ్రహించి, ఈ గుడ్ ఫ్రైడేను నిజమైన శుభదినంగా మార్చుకోవాలి
Read More : Odela 2 Movie: ఓదెల 2 మూవీ రివ్యూ