Four Stars of Destiny book : మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణె రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం విడుదలకు ముందే వివాదంలో చిక్కుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు మౌనం పాటించిన నరవణె తాజాగా స్పందించారు. తన అధికారిక సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పుస్తక ప్రచురణకర్త విడుదల చేసిన ప్రకటనను షేర్ చేస్తూ, “నా పుస్తకం ప్రస్తుత స్థితి ఇదే” అని పేర్కొన్నారు.
ఈ వివాదంలో నరవణె పూర్తిగా ప్రచురణ సంస్థ వాదనకే మద్దతుగా నిలిచారు. పుస్తక ప్రచురణకర్త పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పుస్తకం ఇప్పటివరకు ముద్రిత రూపంలో గానీ, డిజిటల్ రూపంలో గానీ అధికారికంగా విడుదల కాలేదు. సోషల్ మీడియాలో లేదా మార్కెట్‌లో చక్కర్లు కొడుతున్న ప్రతులు అనధికారికమైనవని, అవన్నీ కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తాయని స్పష్టం చేసింది.
Read Also: PAK vs USA: ఓటమిపై స్పందించిన అమెరికా కెప్టెన్
అలాగే రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి తుది అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని, ఆ కారణంగానే పుస్తక ప్రచురణ ఆలస్యమవుతోందని ప్రచురణ సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ అంశంపై రాజకీయ దుమారం కూడా కొనసాగుతోంది.
పార్లమెంట్ వెలుపల విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నరవణె 2023లో చేసిన ఓ పాత సోషల్ మీడియా పోస్ట్‌ను ప్రస్తావిస్తూ, అప్పట్లో పుస్తకం అందుబాటులో ఉందని ఆయన ట్వీట్ చేశారని ఆరోపించారు. అయితే ఇప్పుడు ప్రచురణ సంస్థ పుస్తకం ఇంకా విడుదల కాలేదని చెబుతుండటంపై సందేహం వ్యక్తం చేశారు. వీరిలో ఎవరో ఒకరు అసత్యం చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, ఈ పుస్తకం అనధికారికంగా సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న విషయంపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: