న్యూఢిల్లీ: భారత్‌పై అమెరికా సుంకాల మోతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. సుంకాల విషయమై చర్చలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్లారని తెలిపారు. అమెరికా వాణిజ్య మంత్రులతో ఆయన చర్చలు జరుపుతున్నారని చెప్పారు. భారత్ ఎగుమతుల విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చర్చలు ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్లు, వ్యాపార సంఘాల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని బడ్జెట్‌లో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక వేత్తలు, వివిధ వర్గాల మేధావులతో కేంద్ర బడ్జెట్‌పై విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీకి కేంద్రంతో ముడిపడిన ప్రతి ప్రాజెక్టుకు ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నట్టు పునరుద్ఘాటించారు. విశాఖ ఉక్కు పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు.
కారు కొంటే దానిపైనే పన్ను చెల్లిస్తాం
ఏటా బడ్జెట్ టేబుల్ చేశాక మధ్యలో గడువు ఉంటుంది. మళ్లీ పార్లమెంట్ మొదలయ్యాక ఫైనాన్స్ బిల్లుపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఆమోదం ఉంటుంది. ముఖ్యమైన అభిప్రాయాలు, సూచనలొస్తే సవరణలు చేసి బడ్జెట్‌ను ఆమోదిస్తాం. ప్రభుత్వ ఖర్చులతో రోడ్లు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు నిర్మిస్తున్నాం. జల్‌జీవన్ మిషన్ ద్వారా ఒక్కో ఇంటికి తాగునీరు అందిస్తున్నాం. మనం ఉపయోగించుకున్న వాటికే పన్ను చెల్లిస్తాం. కారు కొంటే దానిపైనే పన్ను చెల్లిస్తాం.. కొనని వారు చెల్లించరు. రోడ్డు వినియోగించుకున్న వారే టోల్ ట్యాక్స్ చెల్లిస్తారు. ప్రజలు పన్నులు చెల్లిస్తేనే రహదారులు నిర్మించగలిగేది అని ఆర్థిక మంత్రి వివరించారు.