ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతాల్లోని వీధుల్లో తిరుగుతున్న కుక్కలను తక్షణమే తొలగించి, షెల్టర్లకు తరలించాలంటూ సుప్రీంకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల భద్రత, ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. అయితే, ఈ తీర్పుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.బీజేపీ ఎంపీ మరియు జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ (Maneka Gandhi) , ఈ తీర్పుపై తీవ్రంగా స్పందించారు. ఇది ఆర్థికంగా అసాధ్యం. పర్యావరణ సమతుల్యతను పూర్తిగా దెబ్బతీసే నిర్ణయం, అని ఆమె వ్యాఖ్యానించారు. కుక్కలను ఒకచోటినుంచి తొలగిస్తే, ఖాళీ అయిన ప్రదేశాన్ని వెంటనే కొత్త కుక్కలు ఆక్రమిస్తాయని ఆమె హెచ్చరించారు.ఢిల్లీ నుంచి కుక్కలను తొలగిస్తే, 48 గంటల్లో ఘజియాబాద్, ఫరీదాబాద్ నుంచి లక్షల కుక్కలు ఆహారం కోసం వస్తాయి, అని మేనకా గాంధీ అన్నారు. కుక్కలు లేనప్పుడు కోతులు, ఎలుకలు వంటి ఇతర జంతువులు రోడ్లపైకి వస్తాయని కూడా ఆమె చాటి చెప్పారు. ఆమె సొంత ఇంటి వద్ద ఇలా జరగటం చూసిన అనుభవాన్ని కూడా వివరించారు.
చరిత్ర పాఠాలు: పారిస్ లో జరిగిన ఘటనేంటీ?
ఆమె ఉదాహరణగా 1880లలోని పారిస్ ఘటనను ప్రస్తావించారు. అప్పట్లో పారిస్ వీధుల్లో ఉన్న కుక్కలను అధికారులు నిర్మూలించారు. దీని తత్ఫలితంగా, నగరంలో ఎలుకల సంఖ్య క్రమంగా అదుపు తప్పింది. మురుగు కాలువల్లోని ఎలుకలు ఇళ్లపైకి ఎక్కి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేశాయి.కుక్కలు సహజ శత్రువులుగా ఎలుకలను నియంత్రిస్తాయని జీవశాస్త్రం చెబుతోంది. వీధికుక్కలు మునిసిపాలిటీలకు సమస్యలా కనిపించినా, అవి ఒక సమతుల్య వ్యవస్థలో భాగమే. అవి ఎలుకల పెరుగుదలపై నియంత్రణ కలిగించడంలో సహకరిస్తాయి.
పరిష్కారం అవసరం, కానీ సమతుల్యతతో
ప్రజల భద్రతను కాపాడటమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ వాటి వల్ల వచ్చే పరిణామాలపైనా అంతే శ్రద్ధ చూపాలి. పారిస్ వలె చరిత్రను పునరావృతం చేయకుండా, సమతుల్యతతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం అవసరం.నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ, జీవ వ్యవస్థపై దీని ప్రభావాన్ని కూడా పరిగణించాలి. కుక్కలు తొలగించడమే శుభ్రతకు మార్గం కాదు. దీనికంటే మెరుగైన, శాస్త్రీయ పద్ధతులు అవసరం.
Read Also : Chandrababu : కేంద్రం నిర్ణయంపై సీఎం చంద్రబాబు హర్షం