కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) , కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ఉద్రిక్తతలు తెరపైకి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా రాజకీయ సందేశాన్ని ప్రసారం చేస్తున్నాయి.
ఢిల్లీలో డీకే సంచలన వ్యాఖ్యలు
ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ‘రాజ్యాంగ సవాళ్లు’ అనే కార్యక్రమంలో డీకే శివకుమార్ (DK Shivakumar) తన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తన పాత్ర ఎంతో కీలకమని, తాను చేసిన త్యాగాలు గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గాంధీ కుటుంబాన్ని ప్రశంసిస్తూ, అధికార భాగస్వామ్యం గురించి పరోక్షంగా కీలక సందేశం ఇచ్చారు.
సోనియా గాంధీ త్యాగాన్ని ప్రస్తావించిన డీకే
శివకుమార్ (DK Shivakumar) తన ప్రసంగంలో 2004లో సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రధానమంత్రి పదవిని తిరస్కరించిన సందర్భాన్ని ఉదహరించారు. “అధికారాన్ని పంచుకోవాలంటే పెద్ద మనసు కావాలి. సోనియా గాంధీ ఒక మైనారిటీ వ్యక్తిని దేశ ప్రధానిగా చేసిన దృక్పథం గొప్పది. కానీ నేటి రాజకీయాల్లో ఒక చిన్న పదవిని కూడా వదిలేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు,” అని పేర్కొన్నారు. ఇంత పెద్ద త్యాగం ఈ ప్రజాస్వామ్యంలో ఇంకెవరైనా చేశారా? ఈ రోజుల్లో కనీసం ఒక చిన్న పంచాయతీ పదవిని కూడా వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు అని ఆయన వ్యాఖ్యానించారు.
శివకుమార్ ఎవరి పేరునూ నేరుగా చెప్పనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు సిద్ధరామయ్యను ఉద్దేశించి చేసినవే అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల సిద్ధరామయ్య మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి అధికార భాగస్వామ్య ఒప్పందం లేదని, ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: