దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో సేవలందిస్తున్న టర్కీ (Turkey)కి చెందిన ప్రముఖ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ సెలెబి (Celebi)కు ఢిల్లీ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) రద్దు చేసిన భద్రతా అనుమతిని పునరుద్ధరించాలని సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. జాతీయ భద్రతపై కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ హైకోర్టు స్పష్టం చేసింది.విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరై కీలక వాదనలు వినిపించారు. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకునే సెలెబికి భద్రతా అనుమతిని రద్దు చేసినట్లు వివరించారు. ఈ వాదనలకు హైకోర్టు పూర్తి మద్దతు తెలిపింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తేలికపాటిగా తోసిపుచ్చింది.
ఎటువంటి నోటీసు ఇవ్వలేదు: సెలెబి వాదన
దీనిపై సెలెబి తరఫు న్యాయవాది మాట్లాడుతూ, బీసీఏఎస్ తమకు ముందస్తుగా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అనూహ్యంగా క్లియరెన్స్‌ను రద్దు చేసిందని ఆరోపించారు. దీంతో సంస్థలో పనిచేస్తున్న 3,800 మంది ఉద్యోగులు కోల్పోతారని, భారత వృద్ధిచెందుతున్న విమానయాన రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
టర్కీ పాక్ మద్దతుతో భారత్ లో సెంటిమెంట్ మార్పు
ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కీ, పాకిస్థాన్‌కు డ్రోన్లు, క్షిపణులు అందించి మద్దతు తెలపడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో ‘బాయ్‌కాట్ టర్కీ’ ఉద్యమం ఊపందుకుంది. దీనికనుగుణంగానే కేంద్రం టర్కీ సంస్థలపై భద్రతాపరమైన ఆంక్షలు విధించింది.
టర్కీ ఒప్పందాలపై దేశవ్యాప్తంగా ప్రతికూల ప్రభావం
కేవలం విమానాశ్రయ సేవలకే కాకుండా పలు ట్రావెల్ ఏజెన్సీలు, విశ్వవిద్యాలయాలు కూడా టర్కీతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. దేశ భద్రతే ప్రధానమైన ఈ సమయంలో, విదేశీ సంస్థలపై భారత్ తీసుకునే నిర్ణయాలు గట్టి నిర్ణయాలే కావాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Viaan Mulder: చరిత్ర సృష్టించిన వియాన్ మల్డర్