దేశ రాజధాని ఢిల్లీ(Delhi Fog) శుక్రవారం ఘనమైన పొగమంచుతో కమ్ముకుపోయింది. ఉదయం నుంచే దృశ్య స్పష్టత బాగా తగ్గిపోవడంతో విమాన రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒక్క రోజులోనే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 152 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 79 విమానాలు ఇతర నగరాలకు వెళ్లాల్సినవిగా ఉండగా, 73 విమానాలు ఢిల్లీకి రావాల్సినవిగా ఉన్నాయి.
ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ‘క్యాట్–III’ (CAT III) విధానంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయినప్పటికీ అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ విమానాల తాజా సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని విమానాశ్రయ అధికారులు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా సూచించారు. ఇండిగో, ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు కూడా వాతావరణ పరిస్థితుల కారణంగా సేవల్లో మార్పులు ఉండొచ్చని ప్రయాణికులను అప్రమత్తం చేశాయి.
AQI 380 కి చేరింది: ఢిల్లీకి ఐఎండీ ఎల్లో అలర్ట్
పొగమంచుతో పాటు తీవ్రమైన వాయు కాలుష్యం కూడా ఢిల్లీని వేధిస్తోంది. గాలి నాణ్యత సూచీ (AQI) 380 స్థాయికి చేరడంతో పరిస్థితి ‘తీవ్ర’ కేటగిరీలోకి వెళ్లింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో దృశ్య స్పష్టత 100 మీటర్లకు దిగువకు పడిపోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇలాంటి పరిస్థితులే ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ కొనసాగుతున్నాయి. అక్కడ కూడా రాబోయే రెండు రోజులు పొగమంచు కొనసాగుతుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. రేపు కొంత ఉపశమనం కనిపించినా, ఆదివారం మరియు సోమవారం మళ్లీ దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: