నాగ్పూర్, ఆగస్టు 11 : నాగ్పూర్లో మానవత్వాన్ని ప్రశ్నించే అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో కళ్లెదుటే భార్య ప్రాణాలు (Wife’s life) కోల్పోగా, సహాయం కోసం భర్త చేసిన ఆర్తనాదాలు అరణ్యరోదనలయ్యాయి. గంటల తరబడి వేచి చూసినా ఎవరూ కనీసం స్పందించకపోవడంతో, చివరకు భార్య మృతదేహాన్ని తన బైక్కు కట్టుకుని సొంతూరుకు బయలుదేరాడు. ఈ హృదయ విదారక దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాకు చెందిన అమిత్ యాదవ్ (35), గ్యార్సి దంపతులు ఉపాధి కోసం నాగ్పూర్లోని లోనారా ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈనెల 9న రాఖీ పండుగ సందర్భంగా వీరు బైక్పై నాగ్పూర్ నుంచి మధ్యప్రదేశ్లోని తమ స్వగ్రామం కరన్పూరు బయలుదేరారు. నాగ్పూర్ జబల్పూర్ జాతీయ రహదారిపై మోర్ఫాటా సమీపంలోకి రాగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గ్యార్సి కిందపడిపోగా, ట్రక్కు ఆమెపై నుంచి దూసుకెళ్లింది. డ్రైవర్ ట్రక్కును ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో గ్యార్సి అక్కడికక్కడే మృతి చెందింది. భార్య మరణంతో కుప్పకూలిపోయిన అమిత్ యాదవ్, సహాయం కోసం అటుగా వెళ్తున్న వాహనదారులను వేడుకున్నాడు. కానీ, ఎవరూ ఆగలేదు. ఏం చేయాలో పాలుపోని నిస్సహాయ స్థితిలో, భార్య మృతదేహాన్ని తన బైక్కు కట్టుకుని సొంతూరుకు తీసుకెళ్లేందుకు సిద్ధపడ్డాడు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత, పోలీసులకు ఈ విషయం తెలిసింది. వెంటనే వారు వెళ్లి అమిత్ యాదవు ఆపారు. అనంతరం మృతదేహాన్ని నాగ్పూర్లోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు (Case of death) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటన మానవ సంబంధాలు, సామాజిక బాధ్యతపై తీవ్ర చర్చకు దారితీసింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :