చంద్రఘంటా దేవి కథ
Day 3 Navartri 2025: చంద్రఘంటా(Maa Chandraghanta) అమ్మవారు దుర్గాదేవి తొమ్మిది రూపాలలో మూడవ అవతారం. నవరాత్రుల్లో మూడవ రోజున ఆమెను ఆరాధిస్తారు. చంద్రఘంటా అమ్మవారిని పూజించేవారికి శాశ్వత శక్తి మరియు బలం లభిస్తుంది. ఆమె సూర్యునిచే పాలించబడే నాభిపై ఉన్న మణిపూర చక్ర దేవత.
పార్వతి దేవి మనసులో శివుడిని భర్తగా చేసుకోవాలనే సంకల్పం కలిగింది. అయితే శివుడు, “నేను ఎవ్వరినీ వివాహం చేసుకోను, బ్రహ్మచారి జీవితమే గడుపుతాను” అని చెప్పాడు. ఈ మాట విని పార్వతి తీవ్ర తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేయడానికి కృషి చేసింది. చివరకు ఆమె భక్తి చూసి శివుడు కరుణించి వివాహానికి అంగీకరించాడు.
శివుడు దేవతలు, ఋషులు, గణాలు, భూతగణాలతో కలిసి హిమవంతుడి రాజభవనానికి చేరారు. కానీ శివుడు భయంకరమైన రూపంలో ప్రత్యక్షం కావడంతో పార్వతి తల్లి మెనావతి భయంతో మూర్ఛపోయింది. ఆ సమయంలో పార్వతి, చంద్రఘంటా రూపం ధరించి శివుడిని శాంత స్వరూపంలోకి రావాలని ప్రార్థించింది. ఆమె ప్రార్థనతో శివుడు మళ్ళీ సుందర యువకుడి రూపం ధరించాడు. మెనావతి కూడా శివుడు సుందర యువకుడి రూపం చూసి కుమార్తె దివ్య వివాహాన్ని ఆనందంగా ఆశీర్వదించింది.
Day 3 Navartri 2025: చంద్రఘంటా దేవి న్యాయం, శాసనాన్ని స్థాపించే శక్తి. ఆమె శరీరం బంగారు వర్ణంలో ప్రకాశిస్తుంది. ఆమె వాహనం సింహం – ఇది ధర్మానికి ప్రతీక. ఆమెకు పది చేతులు, మూడు కళ్ళు ఉన్నాయి. ఎనిమిది చేతుల్లో ఆయుధాలు ఉండగా, మిగతా రెండు చేతులు వరప్రదానం, రక్షణ ముద్రల్లో ఉంటాయి. ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా కనిపిస్తారు.
‘చంద్రఘంటా’ అన్న పేరు శాంతి, ఆనందం, జ్ఞానం సూచిస్తుంది. చంద్రకాంతి కిరణాల్లాంటి చల్లదనాన్ని భక్తులకు అందిస్తుంది. ఆమె అనుగ్రహంతో భక్తుల పాపాలు నశించి, కష్టాలు తొలగిపోతాయి.
నవరాత్రుల్లో మూడవ రోజు సాదకుడు మణిపూరక చక్రాన్ని స్పృశించి, దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు పొందుతాడు. చంద్రఘంటా అమ్మవారి కృపతో అతని సర్వపాపాలు దహించబడతాయి. పూజ తక్షణ ఫలితాన్ని ఇస్తుంది. ఆమె గంట నాదం దుష్ట శక్తులను తరిమేస్తుంది. భక్తులు సింహం వలె ధైర్యవంతులు, భయరహితులు అవుతారు.