Cigarette price hike : సిగరెట్ తాగేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు–2025కు ఆమోదం లభించింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా సిగరెట్లు సహా అన్ని పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టిన ఈ సవరణల ప్రకారం, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను గణనీయంగా పెంచారు. ప్రస్తుతం మార్కెట్లో సగటున రూ.18కి లభిస్తున్న ఒక సిగరెట్ ధర, పన్నుల పెంపు తర్వాత రూ.70కు పైగా చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ప్రతి వెయ్యి సిగరెట్లపై రూ.200 నుంచి రూ.735 వరకు ఉన్న పన్ను, ఇకపై రూ.2,700 నుంచి రూ.11,000 వరకు పెరగనుంది.
అలాగే, చ్యూయింగ్ టొబాకో (ఖైనీ, గుట్కా)పై పన్ను 25 శాతం నుంచి 100 శాతానికి, హుక్కా పొగాకుపై పన్ను 25 శాతం నుంచి 40 శాతానికి పెరుగనుంది. స్మోకింగ్ మిశ్రమాలపై అయితే ఏకంగా 60 శాతం నుంచి 300 శాతం వరకు పన్ను భారం పడనుంది.
Read Also: Women T20: భారత మహిళా క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన దీప్తీ శర్మ
ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు (Cigarette price hike) వ్యక్తమవుతున్నాయి. ధరలు భారీగా పెరగడం వల్ల యువత ముఖ్యంగా ఈ అలవాటుకు దూరమవుతారని, ఇది ప్రజారోగ్యానికి మేలు చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే వ్యసనపరులు ధరలు పెరిగినా మానుకోరని, దీనివల్ల మధ్యతరగతి వర్గాలపై ఆర్థిక భారం పెరుగుతుందని మరికొందరు విమర్శిస్తున్నారు. నకిలీ, అక్రమ పొగాకు ఉత్పత్తుల రవాణా పెరిగే ప్రమాదం కూడా ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పొగాకు వినియోగం వల్ల దేశంలో ఏటా లక్షలాది మంది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్న నేపథ్యంలో, ధరల పెంపు ద్వారా వినియోగాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే ప్రజారోగ్యంపై సానుకూల ప్రభావం ఉండవచ్చని, అయితే పొగాకు వినియోగదారులకు మాత్రం ఇది భారీ ఆర్థిక భారంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: