బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో ప్రముఖ సెలబ్రిటీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రమోట్ చేసినందుకు గానూ, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కీలక చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, నటుడు సోనూ సూద్, నటీమణులు ఊర్వశి రౌతేలా, నేహా శర్మలకు సంబంధించిన రూ. 7.93 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సెలబ్రిటీల ప్రమేయం ఉండటంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Hyderabad: ఓల్డ్ సిటీలో రూ.400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
ప్రధానంగా ‘1xBet’ వంటి విదేశీ బెట్టింగ్ యాప్‌ల చుట్టూ ఈ దర్యాప్తు తిరుగుతోంది. ఈ యాప్‌లు భారత్‌లో చట్టవిరుద్ధమైనప్పటికీ, సెలబ్రిటీల ద్వారా సామాన్యులను ఆకర్షిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో, ఈ సంస్థకు సంబంధించి మొత్తం రూ. 19.07 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. బెట్టింగ్ ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును వివిధ మార్గాల్లో మళ్లించారని, ఆ నిధులతోనే సెలబ్రిటీలకు పారితోషికాలు చెల్లించారని దర్యాప్తు సంస్థ అభియోగిస్తోంది.
సాధారణంగా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ తమ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకోవడానికి సెలబ్రిటీలను వాడుకుంటాయి. అయితే, ఇలాంటి ప్రమోషన్ల ద్వారా వచ్చిన ఆదాయం “క్రైమ్ ప్రొసీడ్స్” (నేరపూరిత ఆదాయం) కిందికే వస్తుందని ఈడీ భావిస్తోంది. గతంలో కూడా పలువురు నటీనటులకు ఈ విషయంలో నోటీసులు జారీ చేసిన అధికారులు, తాజాగా ఆస్తుల జప్తికి దిగడంతో సెలబ్రిటీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇకపై యాప్స్ ప్రమోషన్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com