మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం: ఢిల్లీ సిఎం
అంతర్జాతీయంగా ఆందోళనకు గురిచేసిన ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారుబాంబు కేసులో ప్రాథమికని వేదికను కేంద్రానికి అందచేసారు. సంఘటన ప్రాంతంలో ఎన్ఎస్ఐఎ, ఎన్ఎస్ఇ ఢిల్లీ పోలీసులు ఇతర ఫోరెన్సిక్ నిపుణులు చేపట్టిన దర్యాప్తును క్రోడీకరించి నివేదికను హోంశాఖకు అందచేశారు. ఉగ్రదాడిగానే నిర్ధారించారు. ముందు రోజు 2900 కిలోల ఐఇడి సామగ్రిని స్వాధీనంచేసుకున్న భద్రతా బలగాలు ఉగ్రనెట్వర్క్ బలపడుతోందన్న ఇంటెలిజెన్స్ నివేదికలు ఆధారంగానే అప్రమత్తం అయిన దశలో ఈ పేలుడు సంభవించింది.
Read Also : Irfan Ahmed: ఉగ్రకుట్ర ప్రధాన సూత్రధారి అరెస్ట్?
ఈ పేలుడు ఆత్మాహుతి దాడిగానే పరిగణిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తమ నివేదికలో పొందుపరిచారు. అలాగే నిందితులు ఈ పేలుడు సామగ్రిని తీసుకెళుతుండగా ఆకస్మికంగా జరిగిందిగా ముందు అనుమానించారు. పేలుడు సామగ్రి భారీ ఎత్తున పట్టుబడటంతో మిలిటెంట్లు తమవద్ద ఉన్న సామగ్రిని మరోప్రాంతానికి తరలించే క్రమంలోనే ఈ పేలుడు జరిగిందని నిర్ధారించారు. సమగ్ర దర్యాప్తుకోసం ఎన్ఐఎకు అప్పగించడంతో మొత్తం బృందాలు రంగంలోకి దిగాయి. సరిహద్దు రాష్ట్రాల్లో కూడా అంటే యుపి, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, జమ్ముకాశ్మీర్‌లలో కూడా తనిఖీలు, సోదాలు ముమ్మరం చేసారు.
ఇదిలా ఉంటే మంగళవారం మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీనితో 12 మంది మృతులు, 25 మందికిపైగా గాయపడినట్లు ఏజెన్సీలు తమ నివేదికలో తెలిపాయి. దీనికి తోడు దర్యాప్తు చేపట్టిన ఏజెన్సీలతో హోంమంత్రి అమిత్ ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. కర్తవ్యభవన్‌లోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఢిల్లీ కమిషనర్ సతీష్ గోరా, ఎన్ఐఎ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్, జమ్ముకాశ్మీర్ డిజిపి నళిన్ ప్రభాత్ వర్చువల్గా హాజరుకాగా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తన కుమార్, ఎన్ఎ డైరెక్టర్ జనరళ్లు, ఫోరెన్సిక్ ఉన్నతాధికారులు, హోంశాఖ కార్యదర్శి గోవింద్ మెహన్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ సమీక్షకు హాజరయ్యారు.అంతేకాకుండా ఈ సందర్భంగా సేకరించిన సిసిటివి ఫుటేజిని కూడా సమీక్షలో వీక్షించి పార్కింగ్ ఏరియా ప్రాంతాన్ని మొత్తం తనిఖీచేసారు. అయితే కారులో ఉన్నది ఒక్కడేనని భావిస్తున్నారు. ఆతడిని ఆత్మాహుతి దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని హోంమంత్రికి వివరించారు. అలాగే వందకుపైగా సిసిటివి క్లిప్పింగ్లు సేకరించారు. సమీపంలోని టోల్లాజాల సిసిటివి ఫుటేజీ కూడా తీసుకున్నారు. సుదీర్ఘంగా నాలుగు గంటలపాటు జరిగిన సమీక్ష అనంతరం ఈ పేలుడు కేసును ఎన్ఐఎ దర్యాప్తునకు ఆదేశించినట్లు హోంమంత్రి ప్రకటించారు.
ఇదిలా ఉంటే పేలుడులో ఉపయోగించిన హుండై ఐ10 కారు యజమానిని అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ), పేలుడు సామగ్రి నిరోధక చట్టం, భారతీయ న్యాయనిబంధనల కింద కేసులు నమోదుచేసారు. కోత్వాలి పోలీస్ స్టేషన్లో ఈ ఎర్రకోట పేలుడు కేసు నమోదయింది. వైట్కాలర్ ఉగ్ర మాడ్యూల్‌గా ఈ కేసును ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
పేలుడు వెనుక ప్రతి ఒక్కర్ని వేటాడతాం… అమిత్
సుదీర్ఘ సమీక్ష జరిగిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ మాట్లాడుతూ ఈ పేలుడు ఘటన వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ వేటాడాలని ఆదేశించారు. ఢిల్లీతోపాటు సరిహద్దు రాష్ట్రాలు, ఉగ్రకదలికలున్న రాష్ట్రాల్లో భద్రతపై హోంమంత్రి రెండు పర్యాయాలు సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ ఉపేక్షించేదిలేదని, అందరిపైనా ఉక్కుపాదం మోపుతామని తెలిపారు.
పేలుడు కేసులో ఆరుగురు అరెస్టు
ఎర్రకోట పేలుళ్ల కేసు దర్యాప్తును వేగవంతం చేసిన చర్యల్లో భాగంగా పోలీసులు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న డా. ఉమర్ నబీ ఇద్దరు సోదరులు, అతని తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉమర్ నబీయే కారును నడిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. పుల్వామాలో నిందితుని ఇల్లు మొత్తాన్ని సోదా చేసి, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. తన భర్తతో పాటు మరిది, అత్తను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు నిందితుడి వదిన తెలిపింది.అలాగే తల్లినుంచి డిఎన్ఎ నమూనాలు సేకరించి ఆత్మాహుతి నిందితుడి శరీర భాగాలతో పోల్చి పరీక్షించనున్నారు. ఇద్దరు సోదరులు ఉమర్ రషీద్, అమీర్ రషీద్‌లని పోలీసులు తెలిపారు. తారిక్‌కు 20 కారును అమీర్ విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. ఇదిలా ఉంటే అలఫలా వర్సిటీ నుంచి అరెస్టు అయిన మహిళా డాక్టర్‌కు జైషే ముహ్మద్ మహిళా నియామక బాధ్యతలను అప్పగించింది.
హై సెక్యూరిటీ జోన్‌లో మూడున్నర గంటలపాటు అదేకారు…
ఎర్రకోట ప్రాంతం హై సెక్యూరిటీ జోన్‌గా పరిగణించబడుతుంది. పేలుడుకు ముందు మధ్యాహ్నం 3.19 గంటలకు ఎర్రకోట పార్కింగ్ ప్రాంతానికి వచ్చిన హుండై ఐ10 సాయంత్రం 6.22 గంటలవరకూ అక్కడే ఉందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే ఆ సమయంలో కారునుంచి ఎవ్వరూ కిందికి దిగలేదని తెలుస్తోంది. పేలుడుకు ముందు ఎక్కువ రద్దీ ఉన్న సమయాన్నే ఎంచుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.అలాగే ఈ మూడు గంటలు పర్సెల్ ఆదేశాలు లేదా లాజిస్టిక్ కారణాలకైనా వేచి ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ పోలీసులు పహార్ గంజ్, దర్యాగంజ్ ప్రాంతాల్లోని హోటళ్లలో రాత్రంతా దాడులు నిర్వహించి నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజధాని వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు చొప్పున పరిహారం
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడులో మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. శాశ్వత అంగవైకల్యం సంభవించిన వారికి రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.1 లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. బాధితులు అందరికీ అండగా ఉంటామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రకటించారు.
దీనిపై మీ అభిప్రాయం ఏంటి ?
Read Also : Delhi Bomb Blast: ఉగ్ర కుట్ర వెలుగులో.. నమ్మలేని నిజాలు