బిహార్(Bihar Politics) మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవికి బిహార్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. గత రెండు దశాబ్దాలుగా లాలూ కుటుంబం నివసిస్తున్న అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ఘోర పరాజయం, ఆ తర్వాత కుటుంబంలో అంతర్గత విభేదాలు తలెత్తి లాలూ కుటుంబం ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో, కొత్తగా ఏర్పాటైన నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వారికి మరో గట్టి ఎదురుదెబ్బగా మారింది.
Read Also: Odisha Crime: అమెరికా దత్తత కథలో భారత అమ్మాయి భావోద్వేగ షాక్
10 సర్క్యులర్ రోడ్ నుండి మారాలని నోటీసులు
రబ్రీదేవి మాజీ ముఖ్యమంత్రి హోదాతో పాటు, ప్రస్తుతం బిహార్ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకురాలిగా కొనసాగుతున్నారు. ఆమెకు గతంలో కేటాయించిన 10 సర్క్యులర్ రోడ్‌లోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని భవన నిర్మాణ శాఖ నోటీసులు జారీ చేసింది. గత 20 ఏళ్లుగా ఈ నివాసం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్‌తో సహా కుటుంబ సభ్యులకు నివాసంగా ఉండటమే కాకుండా, ఆర్జేడీ పార్టీకి రాజకీయ కేంద్రంగా కీలక నిర్ణయాలకు వేదికగా నిలిచింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడి హోదాకు అనుగుణంగా ఆమెకు సెంట్రల్ పూల్ బంగ్లాల కింద హార్డింగ్ రోడ్‌లోని ఇల్లు నంబర్ 39ని కొత్తగా కేటాయించారు. అయితే, బంగ్లా ఖాళీ చేయడానికి గడువు తేదీని మాత్రం నోటీసులో పేర్కొనలేదు.
నితీష్ సర్కార్ చర్యపై లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఆగ్రహం
నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రంగా స్పందించారు. ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో స్పందిస్తూ, “ఇది సుశాసన్ బాబు (నితీష్ కుమార్) అభివృద్ధి నమూనా. లాలూ ప్రసాద్ యాదవ్‌ను అవమానించాలనే ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నారు. మీరు ఆయనను ఇంటి నుంచి ఖాళీ చేయించవచ్చు, కానీ కోట్లాది మంది ప్రజల హృదయం నుంచి ఆయన చేసిన సేవలను ఎలా చెరిపేస్తారు?” అంటూ నితీష్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :