విశాఖపట్నానికి చెందిన భరద్వాజ్ దయాల కొత్త దిశలో ప్రయాణిస్తున్నారు.“మిలియన్ అమేజింగ్ ఉమెన్” అనే డాక్యుమెంటరీతో మహిళల జీవితాలను ప్రపంచానికి చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.సంప్రదాయ డిగ్రీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, మంచి జీతం అన్నీ ఉన్నా – ఆ జీవితం మాత్రం అతనికి తృప్తి ఇవ్వలేదు.“జీతం ఉన్నప్పటికీ జీవితంలో అర్ధం మిస్ అయ్యింది” అంటారు భరద్వాజ్.అదే సమయంలో, కొత్తగా ఏదైనా చేయాలన్న తపన అతన్ని ఊరుకోనివ్వలేదు.చివరికి 2006లో తన బైక్‌పై ప్రపంచ యాత్రకు బయలుదేరారు.ఈ ప్రయాణం ఏడాదిన్నర పాటు సాగింది.ఐదు ఖండాల్లోని 16 దేశాలు చుట్టారు.ఈ బైక్ యాత్రలో ఆయన 48,000 కిలోమీటర్లు దాటారు.విశాఖ నుంచి మొదలై ఇరాన్, టర్కీ, సిరియా, ఆఫ్రికా, యూరప్ మీదుగా అమెరికా, న్యూజిలాండ్, ఇండోనేషియా మీదుగా తిరిగి భారత్‌కు చేరుకున్నారు.ఈ యాత్రతో మొదటి భారతీయుడిగా బైక్‌పై ప్రపంచాన్ని చుట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.ఈ యాత్ర అనంతరం మళ్లీ ఉద్యోగంలోకి వెళ్లినా, ఓ ప్రశ్న మాత్రం వెంటాడింది – “మన అమ్మల కథలు ప్రపంచానికి ఎందుకు తెలియకూడదు?” ఇక్కడే ఆయన కొత్త లక్ష్యం మొదలైంది.
‘మిలియన్ అమేజింగ్ ఉమెన్’ – లక్ష్యంతో నిండిన ప్రయాణం
భరద్వాజ్ తల్లి కుసుమ దయాల్ జీవితం అతనికి పెద్ద స్ఫూర్తి.ఐదుగురి పిల్లల్ని ఏకంగా తన భుజాల మీద వేసుకుని పెంచిన ఆమె త్యాగాలే ఈ ప్రాజెక్ట్‌కు మూలం.అదే తల్లి ప్రేమ, బాధ్యత, శక్తి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మంది మహిళలలో ఉంది.అందుకే ఆయన ఈ డాక్యుమెంటరీకి శ్రీకారం చుట్టారు.లక్ష్యం? – ప్రపంచంలోని 195 దేశాల్లోని పది లక్షల మంది మహిళల కథలను చిత్రీకరించడం. అభిజాతుల నుంచి కూలీ మహిళల వరకూ ప్రతి ఒక్కరిని కవర్ చేయాలని ఆయన సంకల్పం.మార్చి 8 – మహిళా దినోత్సవం రోజున గుజరాత్‌లోని బరోడా నుంచి ప్రాజెక్ట్ ప్రారంభమైంది.మొదటి పోట్రేట్ ఫొటో బరోడా రాజమాత సుభాంగినీ రాజేదిది.బ్రిటిష్ రాణి కంటే పెద్ద కోటలో నివసించే ఆమె కథతోనే డాక్యుమెంటరీ మొదలైంది.ఇప్పటివరకూ 400 మంది మహిళల వివరాలు, ఫొటోలు సేకరించబడ్డాయి.అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళలపై ప్రస్తుతం డాక్యుమెంటేషన్ జరుగుతోంది.
డాక్యుమెంటరీ వెనక ఉన్న గొప్ప లక్ష్యం
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రోజువారీ కూలీలు, గిరిజన మహిళలు, సామాజిక కార్యకర్తలు, చిన్న కార్మికుల కథలు కూడా కెమెరాలో బంధిస్తున్నారు.ప్రతి ఒక్కరూ ఒక విజయగాథ వెనుక నిలబడి ఉంటారు – అదే ఈ డాక్యుమెంటరీ స్ఫూర్తి.వీటన్నింటిని ‘మిలియన్ అమేజింగ్ ఉమెన్’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.కొన్ని కథలు వీడియోల రూపంలోనూ చూపించబోతున్నారు.ఈ ప్రాజెక్ట్‌కి కనీసం పది నుంచి పన్నెండు ఏళ్లు పట్టే అవకాశం ఉంది.అయినా, భరద్వాజ్ వెనకడుగు వేయడంలేదు.
మహిళల గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించే ప్రయాణం ఇది.
అవును, ప్రతి మహిళ వెనుక ఒక స్ఫూర్తిదాయక కథ ఉంటుంది.అలాంటి లక్షల కథల్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఈ గొప్ప ప్రయాణం అందరినీ ఆకట్టుకుంటోంది.
Read Also : Pahalgham Attack : కొలంబో విమానంలో భారీ సెర్చ్ ఆపరేషన్