వెండితెరపై భారీ తారాగణం లేకుండానే ఘన విజయం సాధించిన ‘బలగం’ (Balagam)సినిమా దేశవ్యాప్తంగా కుటుంబ అనుబంధాలను మరోసారి గుర్తు చేసింది. గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగభరితంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్నదమ్ముల అనుబంధం, బంధుత్వ విలువలపై ప్రజల హృదయాలను తాకింది. ఈ చిత్రాన్ని చూసిన పలువురు విడిపోయిన కుటుంబ సభ్యులు తిరిగి కలిసిన ఉదాహరణలు ఇప్పటికే బయటకొచ్చాయి. తాజా ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది.
పదేళ్ల ఆగ్రహం – ఒకే గ్రామంలో ఇద్దరైనా మాటలే లేవు
కోనరావుపేట మండలం, కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల నాగయ్య, రాములు(Nagayya , Ramulu) అనే అన్నదమ్ములు చిన్నపాటి మనస్పర్థలతో పదేళ్ల క్రితమే దూరమయ్యారు. ఒకే గ్రామంలో నివసిస్తూ కూడా, ఒకరినొకరు ఎదురుపడినా పలకరించకుండా శత్రువులలా ఉండేవారు. వారి మధ్య రాజీ కుదిర్చేందుకు నాగయ్య కుమారుడు శ్రీనివాస్ అనేకసార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అయినా సరే, కుటుంబం ఒక్కటవాలని అతని కోరిక మాత్రం తీరక మిగిలిపోయింది.
బంధానికి బలమైన ఘట్టం – కన్నీటి కలయిక
కొద్దిరోజుల కిందట మేనల్లుడు కూన తిరుపతి ప్రమాదంలో మరణించడంతో ఏర్పడిన తీన్మారు సందర్భంగా అన్నదమ్ములు మరోసారి ఒకే చోట కలిశారు. అయితే ఈసారి శ్రీనివాస్ చేసిన భావోద్వేగపూరితంగా చేసిన ప్రస్తావనలు వారిలో మానసిక మార్పును తీసుకొచ్చాయి. ఒకరికొకరు కళ్ళతడితో హత్తుకుని, గతాన్ని వదిలేసి భవిష్యత్తులో కలిసి జీవించాలని నిశ్చయించుకున్నారు. ఈ హృద్యమైన కలయికను చూసిన గ్రామస్థులంతా కంటతడి పెట్టారు. బలగం సినిమా ద్వారా చొచ్చుకువచ్చిన భావోద్వేగం మానవ సంబంధాలపై ఎంతటి ప్రభావం చూపిస్తుందో ఈ సంఘటన మరోసారి నిరూపించింది.
Read Also : Kolkata Police : కోల్‌కతాలో రాత్రిపూట డ్రోన్ కలకలం