కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) నిర్వీర్యం అవుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ చట్టాన్ని కేంద్రం ఉద్దేశపూర్వకంగానే నాశనం చేస్తోందని, ఇది కేవలం ఒక పథకంపై దాడి మాత్రమే కాదని, పేదవాడి బ్రతుకుదెరువుపై జరుగుతున్న దాడి అని ఆయన ఆరోపించారు. కార్మికుల హక్కులను కాలరాయడం, గ్రామ పంచాయతీల అధికారాలను తగ్గించడం మరియు రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని హరించడం ద్వారా దేశాన్ని మళ్లీ పాతకాలపు రాజుల పాలనలోకి నెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన తన ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
Elections: తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలషెడ్యూల్ విడుదల
రాహుల్ గాంధీ విశ్లేషణ ప్రకారం, అధికార వికేంద్రీకరణను అడ్డుకోవడం వల్ల దేశంలోని సంపద మరియు అధికారం కేవలం కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తల చేతుల్లోనే కేంద్రీకృతమవుతుంది. ఉపాధి హామీ చట్టం ద్వారా లభించే కనీస వేతనాలు, పని గ్యారంటీ మరియు స్వేచ్ఛగా గౌరవంగా బతికే హక్కును పేదలకు దూరం చేయడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన విమర్శించారు. ఒకప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలిచిన ఈ పథకం, ప్రస్తుతం నిధుల కోత మరియు సాంకేతిక ఇబ్బందుల వల్ల కునారిల్లుతోందని, దీనివల్ల వలసలు పెరిగి పేదరికం మరింత విస్తరిస్తుందని ఆయన హెచ్చరించారు.
మరోవైపు, క్షేత్రస్థాయిలో కార్మికులు ఈ పథకం తమ జీవితాల్లో తెచ్చిన మార్పులను గుర్తు చేసుకుంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. గౌరవప్రదమైన వేతనంతో పాటు, సొంత గ్రామంలోనే పని లభించడం వల్ల కోట్లాది కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయని, అటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేయడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో చారిత్రాత్మక నిర్ణయంగా తీసుకువచ్చిన ఈ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, పేదల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com