దేశంలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లపై కొనసాగుతున్న చర్చకు అలహాబాద్(Allahabad) హైకోర్టు స్పష్టత ఇచ్చింది. అవివాహితులైన ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో కలిసి జీవించడం చట్టానికి విరుద్ధం కాదని న్యాయస్థానం తేల్చింది. అలాంటి వ్యక్తుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంది. అదే సమయంలో, భార్య ఉన్నప్పటికీ విడాకులు తీసుకోకుండా మరో మహిళతో సహజీవనం చేయడం నేరమని, అలాంటి సందర్భాల్లో పోలీసు రక్షణ ఇవ్వలేమని స్పష్టం చేసింది.జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లకు సంబంధించి వచ్చిన పలు పిటిషన్లపై విచారణ జరిపి ఈ రెండు వేర్వేరు తీర్పులు వెలువరించింది.
Read Also: AI Computing: గూగుల్ Torch TPU సీక్రెట్ మిషన్..
అవివాహితుల సహజీవనంపై కోర్టు అభిప్రాయం
తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని చెబుతూ సహజీవనం చేస్తున్న 12 మంది అవివాహిత మహిళలు వేర్వేరుగా హైకోర్టును(Allahabad) ఆశ్రయించారు. ఈ పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం, సంబంధిత జిల్లాల పోలీసు అధికారులకు వారికి తక్షణమే రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం అనే భావన ప్రతి ఒక్కరికీ ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చని అంగీకరించినా, దాన్ని చట్టవ్యతిరేకమని పిలవలేమని స్పష్టం చేసింది. మేజర్లైన ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలన్న నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నించలేవని, వివాహం చేసుకోలేదన్న కారణంతో రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును నిరాకరించలేమని పేర్కొంది. భారత సమాజం క్రమంగా పాశ్చాత్య ఆలోచనలను స్వీకరిస్తోందని, లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కూడా అలాంటి పరిణామాల్లో భాగమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వివాహితులకు రక్షణ లేదన్న కోర్టు స్పష్టత
ఇదే అంశంపై దాఖలైన మరో కేసులో, ఇప్పటికే వివాహితుడైన ఓ వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేస్తూ తనకు పోలీసు రక్షణ కల్పించాలని కోరాడు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా పరిమితులు ఉంటాయని, మొదటి భార్యకు చట్టం కల్పించిన హక్కులను ఉల్లంఘించలేమని కోర్టు స్పష్టం చేసింది. భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో కలిసి జీవించడం చట్టబద్ధం కాదని, అటువంటి పరిస్థితుల్లో పోలీసు రక్షణ ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ రెండు తీర్పుల ద్వారా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లకు సంబంధించి చట్టపరమైన హద్దులను అలహాబాద్ హైకోర్టు స్పష్టంగా నిర్ధారించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: