Air India Crash: జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (Dreamliner) విమాన ప్రమాదంలో 275 మంది మరణించడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
గత దశాబ్ద కాలంలో ఇదే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం కావడంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుండగా, ఐక్యరాజ్యసమితి (ఐరాస) విమానయాన సంస్థ, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) దర్యాప్తులో సహాయం అందించడానికి ముందుకు వచ్చింది.
సాధారణంగా, ప్రమాదం జరిగిన దేశం అభ్యర్థించినప్పుడే (ICAO) సహాయం అందిస్తుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా, (ICAO) స్వచ్ఛందంగా తమ పరిశీలకుడిని పంపడానికి ముందుకొచ్చింది.అయితే, భారత ప్రభుత్వం ICAO ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది.
దర్యాప్తులో తమ పరిశీలకుడిని చేర్చుకోవాలన్న ICAO విజ్ఞప్తిని అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. తమ పరిశీలకుడికి కనీసం పరిశీలన హోదా అయినా ఇవ్వాలని ICAO కోరగా, భారత అధికారులు అందుకు నిరాకరించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామంపై దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న భారత విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB) గానీ, ICAO గానీ అధికారికంగా స్పందించలేదు.
బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణలో గడువు మించిన ఆలస్యం
Air India Crash: మరోవైపు, దర్యాప్తులో కీలకమైన బ్లాక్ బాక్స్‌ల (Black box) డేటా విశ్లేషణలో జాప్యం జరగడంపై భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు (జూన్ 13) ఒక బ్లాక్ బాక్స్ లభించగా, రెండో సెట్‌ను జూన్ 16న గుర్తించారు. అయితే, ప్రమాదం జరిగిన సుమారు రెండు వారాల తర్వాత ఫ్లైట్ రికార్డర్ డేటాను డౌన్‌లోడ్ చేసినట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం అంగీకరించింది.
‘అనెక్స్ 13’గా పిలిచే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు వీలుగా ఫ్లైట్ రికార్డర్ల డేటాను ఎక్కడ విశ్లేషించాలనే దానిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ భారత అధికారులు ఈ విషయంలో చాలా ఆలస్యం చేశారని, దర్యాప్తు పురోగతిపై కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం కేవలం ఒక్కసారి మాత్రమే మీడియా సమావేశం నిర్వహించి, ప్రశ్నలకు తావివ్వకుండా ముగించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
ఐసిఏఓ పరిశీలకునికి భారత్ “నో” చెప్పిన నేపథ్యం
ఈ విమర్శలపై పేరు చెప్పడానికి ఇష్టపడని పౌర విమానయాన శాఖ అధికారి ఒకరు స్పందించారు. తాము అన్ని ICAO నిబంధనలను పాటిస్తున్నామని, ముఖ్యమైన పరిణామాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేస్తున్నామని ఆయన వివరించారు.
సాధారణంగా ఇలాంటి ప్రమాదాలపై ప్రాథమిక నివేదిక రావడానికి సుమారు 30 రోజుల సమయం పడుతుంది. అయితే, దర్యాప్తులో అంతర్జాతీయ సహకారాన్ని నిరాకరించడం, డేటా విశ్లేషణలో జాప్యం వంటి అంశాలు విమానయాన భద్రతపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కారణాలు బయటపడటానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది.