ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి మరో కుదుపు: 13 మంది కౌన్సిలర్లు రాజీనామా, కొత్త పార్టీ ప్రకటన
ఢిల్లీలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి (BJP) గట్టి పోటీనిస్తుందని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుసగా ఎదురుదెబ్బలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన ఆప్, తాజాగా మరో రాజకీయ సంక్షోభానికి లోనైంది. ఈ పార్టీకి చెందిన 13 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఒకేసారి పార్టీకి రాజీనామా చేసి కొత్త రాజకీయ వేదికను ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ పరిణామం ఆప్ రాజకీయ భవిష్యత్తుపై గుబులుపుట్టిస్తోంది. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, ఇతర సీనియర్ నేతలపై న్యాయపరమైన చిక్కులు, ఎన్నికల పరాజయాలు, పార్టీ అంతర్గత విభేదాలు కలిసి ఆప్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి.
‘ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ’ ప్రారంభం – కొత్త రాజకీయ ఉద్యమానికి శ్రీకారం
రాజీనామా చేసిన 13 మంది కౌన్సిలర్లు ముఖేష్ గోయెల్ నేతృత్వంలో ‘ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ’ పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ జాబితాలో ముఖేష్ గోయెల్, హేమంచంద్ గోయెల్, దినేష్ భరద్వాజ్, హిమానీ జైన్, ఉషా శర్మ, సాహిబ్ కుమార్, రాఖీ కుమార్, అశోక్ పాండే, రాజేశ్ కుమార్, అనిల్ రాణా, దేవేంద్ర కుమార్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరిలో చాలా మంది గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినవారిగా ఉండగా, 2020 తర్వాత ఆప్‌లో చేరినవారు కావడం గమనార్హం. ముఖేష్ గోయెల్ అనుభవజ్ఞుడైన నాయకుడు. గత 25 ఏళ్లుగా మున్సిపల్ రాజకీయాల్లో ఉన్న ఆయన, 2021లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి ఆప్ (APP) లో చేరారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదర్శ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీనితోపాటు, పార్టీ మీద పెరుగుతున్న అసంతృప్తి, నాయకత్వంలో అవ్యాఖ్యత వంటి అంశాలు ఆయనతో పాటు ఇతర కౌన్సిలర్లను విడిపోడానికి దారితీశాయి.
ఇప్పటికే బీజేపీలో చేరిన ఆప్ నేతలు – పార్టీ మైనస్‌లోకి
ఇది మొదటిసారి కాదు. మూడు నెలల క్రితమే ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు అనితా బసోయ, నిఖిల్ చప్రానా, ధరమ్‌వీర్ లు ఆప్ (APP) ను విడిచి బీజేపీ (BJP) లో చేరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు ఆప్ (APP) లో నాయకత్వం పై పెరుగుతున్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తున్నాయి. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అవినీతి ఆరోపణల కేసుల్లో ఇరుక్కొనడం, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడ ఓటమిని చవిచూచిన నేపథ్యంలో పార్టీ గందరగోళంలో ఉంది. తాజా రాజీనామాలతో ఆప్ (APP) లో మునిసిపల్ స్థాయిలోని బలమూ తగ్గిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీకి ఊపు – రేఖా గుప్తా నాయకత్వంలో స్థిరంగా ముందుకు
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ పార్టీ తరఫున రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, ఆమె నాయకత్వం బీజేపీ (BJP) కి మరింత బలాన్నిచ్చింది. ఇకపోతే, ఆప్ (APP) పరాజయం అనంతరం వచ్చిన ఈ రాజీనామాలు ఆ పార్టీని మరింత నెమ్మదిగా పతనమవుతున్న పరిస్థితికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ పునర్నిర్మాణం, కొత్త నేతలను ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకోకపోతే, ఢిల్లీలో ఆప్ (APP) రాజకీయ పటముపై కనుమరుగయ్యే ప్రమాదం ఉందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి.
READ ALSO: Shashi Tharoor: దేశ ప్రయోజనాల కోసం పోరాడుతానన్నశశిథరూర్