ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ గుజరాత్, గోవా అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. తమ పార్టీ ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి అతిశీ స్పష్టం చేశారు. గోవాలో మీడియాతో మాట్లాడిన ఆమె, కాంగ్రెస్ సహా ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి పొత్తులపై చర్చలు జరగలేదని ఆమె తెలిపారు.గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో తమ పార్టీ పూర్తిగా స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని అతిశీ వెల్లడించారు. కూటమిగా ఎన్నికల బరిలోకి దిగే ఆలోచన లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలలో 8 మంది బీజేపీలో చేరారు. ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, ప్రస్తుతం కాంగ్రెస్‌కు కేవలం 3 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని ఆమె గుర్తుచేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదన్న అతిశీ
గత ఎన్నికల్లో ఆప్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీలోనే కొనసాగుతున్నారని అతిశీ స్పష్టం చేశారు. మేము రాజకీయాల్లోకి డబ్బు సంపాదించేందుకు రాలేదు. ప్రజా సేవే మా లక్ష్యం. అందుకే మా ఎమ్మెల్యేలు పార్టీలోనే ఉన్నారు అని ఆమె అన్నారు. ఆప్ నేతలు తమ పార్టీ నుంచి బీజేపీకి వెళ్లలేదని, ఎవరు ఎంత ప్రలోభాలు పెట్టినా తాము విలువలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ నుండి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది బీజేపీలో చేరారని, ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ఎలా సాధ్యం అని ఆమె ప్రశ్నించారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితంపై స్పందించిన అతిశీ
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై ఆమె స్పందిస్తూ, “మేము ఓడిపోయామా, గెలిచామా అనేది ముఖ్యం కాదు. ప్రజల పరిస్థితి ఎలా మారుతుందనేదే అసలు ప్రశ్న అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే 250 మొహల్లా క్లినిక్‌లను మూసివేస్తామని, ఉచిత మందులను నిలిపివేస్తామని ఇప్పటికే ప్రకటించిందని గుర్తుచేశారు. మా ప్రభుత్వం ఓడితే విద్యుత్ కోతలు మళ్లీ మొదలవుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందకుండా పోతుంది అని కేజ్రీవాల్ ముందే హెచ్చరించారని అతిశీ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్, గోవాలో తమ బలం పెంచుకునేందుకు కృషి చేస్తోందని, ప్రజలకు తమ పాలన మోడల్‌ను వివరించి, మద్దతు కూడగట్టేందుకు ఇంటింటా ప్రచారం చేపడతామని ఆమె తెలిపారు.