భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరపురాని వివాదాస్పద ఘట్టమైన ఎమర్జెన్సీ విధించి నేటికి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తవుతోంది. 1975 జూన్ 25వ తేదీ రాత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ (Indira Gandhi) తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. అయితే, ఎమర్జెన్సీ విధింపునకు దారితీసిన పరిస్థితులు ఒక్కరోజులో ఏర్పడినవి కావు. కొన్ని నెలల పాటు దేశ రాజకీయాల్లో చోటుచేసుకున్న ఐదు ప్రధాన సంఘటనలు ఈ తీవ్ర నిర్ణయానికి కారణమయ్యాయి. ఆ కీలక పరిణామాలను ఓసారి పరిశీలిద్దాం.
గుజరాత్ ఆందోళనలు – విద్యార్థి ఉద్యమం నుంచి రాజకీయ భూకంపం
1973లో గుజరాత్‌లో హాస్టల్ ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రారంభించిన నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా ఉధృతరూపం దాల్చాయి. అప్పటి ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన్ను “చిమన్ చోర్” (చిమన్ దొంగ) అంటూ ప్రజలు నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో 1974 ఫిబ్రవరిలో ఇందిరా గాంధీ (Indira Gandhi) ప్రభుత్వం చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. ఈ ఘటన కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతకు బీజం వేసింది.
బిహార్ జేపీ ఉద్యమం – సంపూర్ణ విప్లవానికి పిలుపు
గుజరాత్ పరిణామాల స్ఫూర్తితో, బిహార్‌లోనూ ముఖ్యమంత్రి అబ్దుల్ గఫూర్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించారు. గాంధేయవాది, ప్రముఖ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) ఈ ఉద్యమంలో పాలుపంచుకోవడంతో దీనికి మరింత బలం చేకూరింది. ప్రస్తుతం బిహార్ లో కీలక నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ వంటి వారు కూడా ఈ ఉద్యమం నుంచే వెలుగులోకి వచ్చారు. జేపీ “సంపూర్ణ క్రాంతి” (సంపూర్ణ విప్లవం)కి పిలుపునిస్తూ, ప్రధాని పీఠం నుంచి ఇందిరా గాంధీ దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఇందిర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన గళం వినిపించడానికి దోహదపడింది.
జార్జ్ ఫెర్నాండెజ్ రైల్వే సమ్మె – దేశ ఆర్థిక వ్యవస్థకి షాక్
1974లో కార్మిక సంఘ నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఆధ్వర్యంలో జరిగిన రైల్వే సమ్మె దేశ రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఇదే సమయంలో, రైల్వే మంత్రి, బిహార్ ఎంపీ అయిన ఎల్.ఎన్. మిశ్రా ఒక బాంబు దాడిలో మరణించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ సమ్మె, మిశ్రా హత్య ప్రభుత్వానికి తీవ్ర సవాలుగా మారాయి.
ప్రధాని పదవి అర్హత కోల్పోయిన తీర్పు
1971 ఎన్నికల్లో ఇందిరా గాంధీ (Indira Gandhi) మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. 1975 జూన్ 12న జస్టిస్ జగన్ మోహన్‌లాల్ సిన్హా ఇందిరా గాంధీని దోషిగా తేల్చుతూ, ఆమె ఎన్నిక చెల్లదని
తీర్పునిచ్చారు. అదేరోజు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలై, ఐదు ప్రతిపక్ష పార్టీల కూటమి విజయం సాధించడం గమనార్హం. జూన్ 24న సుప్రీంకోర్టు ఈ తీర్పుపై షరతులతో కూడిన స్టే ఇచ్చింది. ఇందిరా గాంధీ ప్రధానిగా కొనసాగవచ్చని, అయితే పార్లమెంటులో ఓటు వేసే హక్కు ఉండదని స్పష్టం చేసింది.
ఎమర్జెన్సీ ప్రకటన – ప్రజాస్వామ్యంపై పడిన చెరటి చాయ
కోర్టు తీర్పు, ప్రతిపక్షాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో 1975 జూన్ 25న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ తదితర ప్రతిపక్ష నాయకులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. “రాజ్యాంగ విరుద్ధమైన ఆదేశాలను” పాటించవద్దని వారు పోలీసులను, సైన్యాన్ని కోరారు. “ఆ మహిళ (ఇందిరా గాంధీ) మా ఉద్యమం ముందు నిలబడలేదు” అని మొరార్జీ దేశాయ్ ఆ సభలో ప్రకటించారు.
సంజయ్ గాంధీ ప్రోత్సాహంతో సంచలన నిర్ణయం
ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో, అదే రోజు రాత్రి ఇందిరా గాంధీ (Indira Gandhi) తన కుమారుడు సంజయ్ గాంధీతో కలిసి ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయించారు. జూన్ 26వ తేదీ తెల్లవారుజామున రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సంతకంతో దేశంలో ఎమర్జెన్సీ అధికారికంగా అమల్లోకి వచ్చింది. పౌర హక్కులు సస్పెండ్ చేశారు, ప్రతిపక్ష నేతలను అరెస్టు చేశారు, పత్రికలపై సెన్సార్‌షిప్ విధించారు. ఈ ఎమర్జెన్సీ సుమారు 21 నెలల పాటు కొనసాగి, భారత రాజకీయాలపై చెరగని ముద్ర వేసింది.
21 నెలల ఎమర్జెన్సీ – ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి మార్గం
1977లో ఎన్నికల వాతావరణంలో కాంగ్రెస్ ఓటమి పాలై, జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఇది ప్రజాస్వామ్యం గెలిచిన ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది.
Read Also: Rahul: రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ అధికారికంగా లేఖ