హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు (Himachal Pradesh Floods) ఉధృతంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు ప్రజలను గడగడలాడిస్తున్నాయి. ఇప్పటివరకు 77 మంది ప్రాణాలు కోల్పోగా, 34 మంది గల్లంతయ్యారు.వర్షాల తీవ్రత కారణంగా రాష్ట్రంలో మొత్తం 345 రహదారులను మూసివేశారు (345 roads closed) . వాటిలో రెండు జాతీయ రహదారులు కూడా ఉన్నాయి. కొండచరియలు విరిగి రోడ్లపై పడటంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అధికారుల ప్రకారం, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.మండీ జిల్లాలో అత్యధికంగా 232 రహదారులు మూసివేయగా, కుల్లు జిల్లాలో 71 రోడ్లు మూసారు. ఈ సమాచారం రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. అదే సమయంలో, 169 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
శిమ్లాలో పాఠశాల గోడ కూలిన ఘటన
శిమ్లా జిల్లాలోని కసుంష్టి ప్రాంతంలో ఒక ప్రాథమిక పాఠశాల గోడ కూలిపోయింది. ఘటన సమయంలో లోపల విద్యార్థులు ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. వెంటనే అక్కడి 65 మంది విద్యార్థులను కమ్యూనిటీ సెంటర్‌కు తరలించారు.ఈ వర్షాల వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 42 ఆకస్మిక వరదలు సంభవించాయి. అలాగే 26 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ ఆర్థిక నష్టం
వరుస వర్షాలతో రాష్ట్ర ఆర్థికంగా కూడా దెబ్బతింటోంది. ఇప్పటివరకు దాదాపు రూ.1,362 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.జూన్ 1 నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 285.2 మిమీగా ఉండగా, ఈసారి 324.2 మిమీ వర్షపాతం నమోదైంది. ఇది 14 శాతం అధికమని అధికారులు వివరించారు.
తాత్కాలిక నివారణ చర్యలు వేగవంతం
ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతోంది. రహదారులపై శిథిలాలను తొలగించేందుకు యంత్రాలు వినియోగిస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండమని కోరుతోంది. అనవసరంగా ప్రయాణాలు మానేయాలని, కొండ ప్రాంతాలకు వెళ్లవద్దని సూచనలు జారీ చేసింది.
Read Also : Phonetapping : ఫోన్‌ట్యాపింగ్ : దొంగచెవుల దందా