తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ (Jana Nayagan) సినిమా విడుదలకు అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. సెన్సార్ వివాదంపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తాజా తీర్పు చిత్ర యూనిట్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది. ‘జన నాయగన్’ సినిమాలోని కొన్ని రాజకీయ సన్నివేశాలు మరియు సంభాషణలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రీ-ఎడిటింగ్ చేయాలని సూచించింది. అయితే గతంలో సింగిల్ బెంచ్ ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సెన్సార్ బోర్డు (CBFC) డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా, న్యాయస్థానం సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది. సినిమాలోని అంశాలు సున్నితమైనవి కావడంతో, పూర్తిస్థాయి విచారణ అవసరమని భావించిన కోర్టు, తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. దీనివల్ల సంక్రాంతి బరిలో నిలవాల్సిన ఈ సినిమా విడుదలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి.
Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం
హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టేతో నిర్మాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సినిమా విడుదల ఆలస్యమైతే ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లుతుందని భావిస్తున్న చిత్ర యూనిట్, ఈ వివాదాన్ని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. సోమవారం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. సెన్సార్ బోర్డు కత్తెరకు లొంగకుండా, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాలని వారు కోరుతున్నారు. సుప్రీంకోర్టులో గనుక ఊరట లభిస్తే, జనవరి 21 వరకు ఆగకుండా సినిమాను ముందే విడుదల చేసే అవకాశం ఉంటుంది.
విజయ్ రాజకీయ రంగప్రవేశం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘జన నాయగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఒక ప్యూర్ పొలిటికల్ థ్రిల్లర్ కావడంతో, ఇందులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పదునైన విమర్శలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. బహుశా అందుకే సెన్సార్ బోర్డు ఈ సినిమాపై కఠినంగా వ్యవహరిస్తోందనే చర్చ ఫిల్మ్ నగర్లో నడుస్తోంది. పండుగ సీజన్‌లో తమ అభిమాన హీరోను స్క్రీన్‌పై చూడాలనుకున్న అభిమానులకు ఈ కోర్టు స్టే నిరాశను మిగిల్చింది. సుప్రీంకోర్టు తీర్పు మరియు సెన్సార్ బోర్డు తదుపరి చర్యలపైనే ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com