బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘కిష్కింధపురి’ (Kishkindhapuri ) రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో, సాహు గారపాటి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ జానర్‌లో వస్తుండటంతో ఆసక్తి రేపుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించగా, భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లంకొండ బాబు చాలా నమ్మకంగా ఉన్నాడు.
హైదరాబాద్‌లోని AAA మల్టీప్లెక్స్‌లో నిన్న ప్రీమియర్ షో నిర్వహించగా, అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్ళేందుకు కొంత సమయం తీసుకున్నప్పటికీ, కిష్కింధపురి సువర్ణ మాయలోకి అడుగుపెట్టిన తర్వాత కథ ఊపందుకుని థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో ఎలాంటి అనవసర హంగులు లేకుండా కథను సజావుగా నడిపిన డైరెక్టర్, సెకండ్ హాఫ్‌లో మాత్రం హారర్ ఎలిమెంట్స్‌ను ఎక్కడా తగ్గకుండా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టాడని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో నటీనటుల ప్రదర్శన ప్రత్యేకంగా ప్రశంసలు పొందుతోంది. తమిళ నటుడు శాండ నటన గూస్‌బమ్స్ తెప్పించేలా ఉందని ప్రేక్షకులు చెబుతుండగా, క్లైమాక్స్‌లో అనుపమ పరమేశ్వరన్ చేసిన పర్ఫామెన్స్‌కి ప్రత్యేకమైన ప్రశంసలు లభిస్తున్నాయి. థ్రిల్లర్ ఎపిసోడ్స్, కథా నేరేషన్ రెండూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అలాగే ఈ చిత్రానికి ప్రధాన బలమైన అంశం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అని చెప్పవచ్చు. ఎం.ఆర్. రాజా కృష్ణన్ అందించిన సౌండింగ్ వల్లే సినిమా మరింత భయానకంగా, థ్రిల్లింగ్‌గా అనిపించిందని ఫీడ్‌బ్యాక్ వస్తోంది. ఓవరాల్‌గా చూస్తే ‘కిష్కింధపురి’ భయపెడుతూ, ఉత్కంఠను రేకెత్తిస్తూ, ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేసే సినిమా అని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్ట్ 2 కోసం ఇచ్చిన లాస్ట్ మినిట్ ట్విస్ట్ మరింత ఆసక్తిని పెంచి, సిరీస్‌గా కొనసాగుతుందనే అంచనాలకు బలం చేకూర్చింది.