HYD మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. రైలు సేవలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రయాణ వేళలను పొడిగించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11:45 వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇప్పటివరకు రాత్రి 11 గంటలకే చివరి మెట్రో ఉండగా, ఇప్పుడు అర్థరాత్రికి సమీపంగా సేవలు కొనసాగనుండడం ప్రయాణికులకు ఎంతో లాభకరం.
ఆఫీస్ గడువులకు తగిన విధంగా మార్పులు
ప్రత్యేకంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ కొత్త టైమింగ్స్ అమలులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీ, ఆఫీస్ పీక్ అవర్స్ ను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సమయాలను పొడిగించారు. ఉదయం, రాత్రి సమయాల్లో ఎక్కువ మంది ప్రయాణికులు మెట్రోపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఇలా మార్పులు చేయడం మెట్రో యాజమాన్యం తీసుకున్న చక్కటి నిర్ణయం అని చెప్పుకోవచ్చు.

ఆదివారాల్లో ప్రత్యేక సమయాలు
ఆదివారాల్లో మెట్రో రైలు మొదటి ట్రిప్ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. సాధారణ రోజుల్లో 6 గంటలకు ప్రారంభం అయితే, వారాంతంలో ప్రజల తరలివచ్చే సమయాన్ని అనుసరించి మార్పులు చేశారు. టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో మొదలయ్యే సమయం గురించి ముందుగా తెలుసుకుని ప్రయాణం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రయాణికుల సౌకర్యం కోసం మెట్రో యాజమాన్యం ప్రయత్నం
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు తరచుగా మార్పులు చేస్తోంది. మెట్రో రైలు సేవలను మరింత విస్తృతం చేసి, ట్రాఫిక్ సమస్య తగ్గించే దిశగా ఈ నిర్ణయం ఉపయోపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. సమయాలను పొడిగించడం ద్వారా ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు అంతరాయంలేకుండా ప్రయాణించే అవకాశం పొందనున్నారు.