Rains: మండుతున్న ఎండలు, ఉక్కపోత వాతావరణం నేపథ్యంలో వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈ మేరకు మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భూ ఉపరితలం వేడెక్కిన ప్రభావంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. రేపు రాత్రి(ఏప్రిల్ 1వ తేదీ) నుంచి మూడో తేదీ వరకు వానలు కురుస్తాయని, అయితే 4వ తేదీన వర్ష ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

ప్రాంతాల్లో ఊరుములు, మెరుపులతో కూడిన వాన
కొన్ని ప్రాంతాల్లో ఊరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశమూ ఉందని హెచ్చరించింది. వర్ష ప్రభావంతో ఏప్రిల్ 2, 3 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్,కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, వికారాబాద్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. పలుచోట్ల ఈదురుగాలులు కూడా వీచే వీలుందని పేర్కొంది.
ఏ జిల్లాలో చూసినా అధిక ఉష్ణోగ్రతలు
కాగా, ప్రస్తుతం తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఏ జిల్లాలో చూసినా ఉష్ణోగ్రతలు అధిక మొత్తంలో నమోదు అవుతున్నాయి. ఏప్రిల్, మే నెలలో దంచికొట్టాల్సిన ఎండలు.. మార్చి నెలలో మాడు పగిలేలా చేస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు మోసుకొచ్చింది. తెలంగాణలో ప్రజలు ఎండల నుండి ఉపశమనం పొందేందుకు కొద్ది రోజుల తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.